Anagani Sathya Prasad: జగన్‌... ఫర్నిచర్ దొంగ: మంత్రి అనగాని సత్యప్రసాద్

AP Minister Anagani Sathyaprasad slams Jagan a furniture thief
  • నాడు చేయని తప్పుకు కోడెలను బలితీసుకున్నారన్న మంత్రి
  • నేడు జగన్ ఫర్నిచర్ అప్పగించకుండా వాడుకుంటున్నారని ఆరోపణ
  • వైసీపీ నేతలు ఇంకా నీతులు చెప్పడం సిగ్గుచేటు అని విమర్శలు
మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫర్నిచర్ దొంగ అంటూ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. ప్రభుత్వ ఫర్నిచర్ అప్పగించకుండా, జగన్ వాడుకుంటున్నారని ఆరోపించారు. 

నాడు చేయని తప్పుకు టీడీపీ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ను బలితీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల వేధింపుల వల్లే కోడెల మృతి చెందారని అన్నారు. నాడు, ఎన్నికల్లో ఓడిపోయాక... ఇంటి నుంచి ఫర్నిచర్ తీసుకెళ్లాలని కోడెల రెండుసార్లు ప్రభుత్వానికి లేఖలు రాశారని, కానీ ఆయన లేఖలు పట్టించుకోకుండా కేసులు పెటి కక్ష సాధించారని అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు.

"ప్రతిపక్ష నేత జగన్ ఇంట్లో ఉన్న ప్రభుత్వ ఫర్నీచర్ సరెండర్ చేయకుండా వాడుకుంటూ వైసీపీ నేతలు నీతులు చెప్పడం సిగ్గుచేటు. గతంలో ఫర్నీచర్ విషయంలో కోడెల శివప్రసాద్ పై అసత్య ఆరోపణలు చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు ఏం సమాధానం చెపుతారు? 

కోడెల శివప్రసాద్ తప్పు చేసి చనిపోలేదు. వైసీపీ నేతల వేధింపులకు గురై చనిపోయారు. కోడెలది ఆత్మహత్య కాదు... వైసీపీ నేతలు చేసిన హత్య! నాడు కోడెల శివప్రసాద్ రావుపై లేని పోని నిందలు వేసి మంచి మనిషిని పొట్టన పెట్టుకోవడమే కాక కోడెల కుటుంబాన్ని మొత్తం మానసిక క్షోభకు గురి చేశారు. కే-టాక్స్ అని, ఫర్నిచర్ అని 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబంపై లేని మరకలు అంటించే ప్రయత్నం చేశారు. 

తన ఇంటి నుండి ఫర్నిచర్ తీసుకెళ్లాలని అప్పటి స్పీకర్ కు కోడెల శివప్రసాద్ రెండుసార్లు లేఖలు రాసినా పట్టించుకోకుండా తప్పుడు కేసులు పెట్టడం మీ కక్ష సాధింపు చర్యలకు నిదర్శనం కాదా?  సీఎంవో ఖాతా నుంచి రూ.50 కోట్లు తీసుకువచ్చి తాడేపల్లి, లోటస్ పాండ్ ఇళ్లలో ఫర్నిచర్, ఇతర వసతులను అమర్చుకున్నారు. ఆ ఫర్నిచర్ ను తిరిగి అప్పగిస్తానని ప్రతిపక్ష నేత జగన్ ఇప్పటి వరకు ప్రభుత్వానికి ఒక్క లేఖ కూడా రాయలేదు. 

ఈ రోజు ఆ భగవంతుడు కోడెల కుటుంబాన్ని కడిగిన ఆణిముత్యం లాగా జనాల్లో నిలిపారు. వారిపై నిందలు మోపిన వారి దొంగ బుద్ధిని రాష్ట్ర ప్రజలు మొత్తం తెలుసుకునే విధంగా చేశాడు. కర్మ సిద్ధాంతం ప్రతి ఒక్కరు నమ్మాల్సిందే. జగన్ రెడ్డి కోడెలకి చేసిందే ఈరోజు ఆయనకు తిరిగి వచ్చింది. అది కూడా ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత. ప్రజలు జగన్ దొంగ బుద్ధి చూసి నేడు ఛీ కొడుతున్నారు. 

ఈ అరాచకాలపై ప్రజల్లో చర్చ జరగాలి. జగన్ కి ఏ మాత్రం నైతిక విలువలున్నా... ప్రభుత్వ సొమ్ముతో తన ఇంట్లోకి కొనుగోలు చేసిన ఫర్నిచర్ ను ప్రభుత్వానికి అప్పగించాలి" అని మంత్రి అనగాని సత్యప్రసాద్ డిమాండ్ చేశారు.
Anagani Sathya Prasad
Jagan'Furniture
Govt
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News