KCR: కమిషన్ చైర్మన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు... బాధ కలిగింది: జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌కు కేసీఆర్ లేఖ

KCR 12 pages letter to Justis Narasimha Reddy commission
  • విద్యుత్ కొనుగోళ్లపై 12 పేజీల లేఖ రాసిన కేసీఆర్
  • రాజకీయ కక్షసాధింపు ధోరణితతో కమిషన్ ఏర్పాటు చేశారని ఆరోపణ
  • విద్యుత్ సంక్షోభంలో ఉన్న తెలంగాణను గట్టెక్కించామన్న కేసీఆర్
  • కమిషన్ నుంచి నరసింహారెడ్డి స్వచ్చందంగా వైదొలగాలని సూచన
  • విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదన్న బీఆర్ఎస్ అధినేత
  • విచారణకు హాజరైనా ప్రయోజనం ఉండదని ఆగిపోయినట్లు చెప్పిన కేసీఆర్
జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌‌‌కు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 12 పేజీల లేఖ రాశారు. విద్యుత్ కొనుగోళ్లపై ఆయన కమిషన్‌కు లేఖ రాశారు. రాజకీయ కక్షసాధింపు ధోరణితోనే ఈ కమిషన్‌ను ఏర్పాటు చేశారని ఆరోపించారు. తమ హయాంలో కరెంట్ విషయంలో గణనీయ మార్పులు చూపించామని పేర్కొన్నారు. 24 గంటల విద్యుత్‌ను అందించినట్లు తెలిపారు. విద్యుత్ సంక్షోభంలో ఉన్న తెలంగాణను తాము అసాధారణ నిర్ణయాలతో గట్టెక్కించామన్నారు. తనపై కమిషన్ చైర్మన్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. చైర్మన్ వ్యాఖ్యలు తనకు బాధ కలిగించినట్లు చెప్పారు. పదేళ్లు సీఎంగా చేసిన తన పేరును ప్రస్తావించారన్నారు.

థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం కాలుష్యం, నిర్మాణ వ్యయం ఎక్కువ అని, అందుకే తాము సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మాణాలు చేపట్టినట్లు ఆ లేఖలో తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం దురుద్దేశ్యంతోనే తనపై, గత ప్రభుత్వంపై ఆరోపణలు చేసి... అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. రాజకీయ కక్షతో వేసిన ఈ కమిషన్ నుంచి నరసింహారెడ్డి స్వచ్చందంగా వైదొలగాలని సూచించారు. ఆయన కూడా తెలంగాణ బిడ్డేనని వ్యాఖ్యానించారు. కమిషన్ విచారణ పారదర్శకంగా లేదన్నారు. విచారణ పూర్తి కాకుండానే ప్రెస్ మీట్ పెట్టారని పేర్కొన్నారు.

కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని విమర్శించారు. వాస్తవానికి జూన్ 15న కమిషన్ ఎదుట హాజరై సమాధానం ఇవ్వాలని భావించానని... కానీ విచారణ పారదర్శకంగా లేకపోవడంతో తాను హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని ఆగిపోయినట్లు చెప్పారు. విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదని అర్థమైందన్నారు. అన్నింటా తాము చట్టాలను, నిబంధనలను పాటిస్తూ ముందుకు సాగామన్నారు. కేంద్ర, రాష్ట్ర అనుమతులతో ముందుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఈఆర్సీ సంస్థలు వెలువరించిన తీర్పులపై కమిషన్లు వేయకూడదన్నారు. కమిషన్లు వేయకూడదన్న విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియదా? అని ప్రశ్నించారు.
KCR
Revanth Reddy
Telangana
High Power Committee

More Telugu News