Kuwait: కువైట్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 41 మంది సజీవదహనం.. మృతుల్లో ఐదుగురు భారతీయులు!

Five Indians among 41 people killed in building fire in Mangaf

  • దక్షిణ మంగాఫ్ జిల్లాలో ఘటన 
  • 195 మంది కార్మికులు నివాసం ఉంటున్న భవనంలో చెలరేగిన మంటలు
  • కార్మికుల్లో కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వారే అత్యధికులు 
  • భవనం మలయాళీ వ్యాపారవేత్త కెజి అబ్రహంకు చెందినదిగా అధికారుల వెల్లడి
  • ఘటనపై కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం విచారం

గల్ఫ్ దేశం కువైట్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 41 మంది మృతి చెందారు. మరో 50 మందికి పైగా గాయాలైనట్లు సమాచారం. మృతుల్లో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నట్లు తెలిసింది. వారందరూ కేరళ రాష్ట్రానికి చెందిన వారని తెలుస్తోంది. దక్షిణ మంగాఫ్ జిల్లాలో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది.

ఓ భవనంలో మంటలు చెలరేగడం వల్ల భారీ స్థాయిలో ప్రాణనష్టం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఈ భవనంలో 195 మంది కార్మికులు నివాసం ఉండగా, వారిలో కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. అలాగే ఈ భవనం మలయాళీ వ్యాపారవేత్త కెజి అబ్రహంకు చెందినదిగా అధికారులు తెలిపారు.  ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని పేర్కొన్నారు. ప్రమాద కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇక ఈ ఘటనపై కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం విచారం వ్యక్తం చేసింది. "ఈరోజు భారతీయ కార్మికులకు సంబంధించిన విషాదకరమైన అగ్నిప్రమాదానికి సంబంధించి ఎంబసీ అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్: 965-65505246ను ఏర్పాటు చేయడం జరిగింది. అప్‌డేట్‌ల కోసం బాధితులందరూ ఈ హెల్ప్‌లైన్‌లో కనెక్ట్ అవ్వాలని అభ్యర్థిస్తున్నాం. సాధ్యమైన సహాయాన్ని అందించడానికి ఎంబసీ కట్టుబడి ఉంది" అంటూ భారత ఎంబసీ 'ఎక్స్' (ట్విట్టర్ ) లో ఒక పోస్ట్‌ చేసింది.

ఈ ఘటనపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, భారత రాయబారి ఘటనా స్థలికి వెళ్లినట్లు తెలిపారు.

"కువైట్ నగరంలో అగ్నిప్రమాద ఘటన వార్తతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. 40 మందికి పైగా మరణించారని, 50 మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారని సమాచారం. మా రాయబారి ఘటనా స్థలికి వెళ్ళారు. తదుపరి సమాచారం కోసం మేము ఎదురుచూస్తున్నాము.
 
ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా మరియు పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఈ విషయంలో సంబంధిత అందరికీ మా ఎంబసీ పూర్తి సహాయాన్ని అందజేస్తుంది" అని జైశంకర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

Kuwait
Fire Accident
Mangaf
Indians
  • Loading...

More Telugu News