Indians In Russian Army: ఉక్రెయిన్ తో యుద్ధం.. రష్యా సైన్యంలోని ఇద్దరు భారతీయుల మృతి

2 Indians Recruited By Russian Army Killed In Ukraine Conflict
  • ఘటనపై భారత్ సీరియస్, భారతీయులను సైన్యంలో చేర్చుకోవద్దని డిమాండ్
  • ఇప్పటికే రష్యా సైన్యంలో ఉన్న వారిని త్వరగా విడుదల చేయాలని కోరిన వైనం
  • సహాయక విధుల పేరిట భారతీయులను సైన్యంలో చేర్చుకుంటున్న రష్యా
  • ఉక్రెయిన్‌లో రష్యన్లు పెద్ద సంఖ్యలో మరణిస్తుండటంతో ఇతర దేశాల నుంచి రిక్రూట్‌మెంట్
రష్యా సైన్యంలో చేరిన ఇద్దరు భారతీయులు ఉక్రెయిన్‌తో యుద్ధం సందర్భంగా దుర్మరణం చెందారు. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం ధ్రువీకరించింది. ఈ విషయాన్ని రష్యా దృష్టికి తీసుకెళ్లామని, భారతీయులను తమ సైన్యంలో చేర్చుకోవద్దని స్పష్టం చేశామని పేర్కొంది. రష్యా ఉద్యోగాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని భారతీయులకు కేంద్రం సూచించింది. ‘‘భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, రష్యాలోని భారత ఎంబసీ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాయి. తమ అభ్యంతరాలను భారత్‌లోని రష్యా రాయబారితో పాటు రష్యా అధికారులకు తెలియజేశాయి. రష్యా సైన్యంలోని భారతీయులను త్వరగా విడుదల చేయాలని కోరాయి’’ అని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.  

ఉద్యోగాల పేరిట అనేక మంది భారతీయులను రష్యా ఆర్మీలోకి చేర్చుకున్నట్టు ఈ మార్చిలో పలు కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన విదేశాంగ శాఖ భారతీయులను వెనక్కు రప్పించేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొంది. 

‘‘సుమారు 20 మంది రష్యాలో చిక్కుకుపోయారు. వారిని త్వరగా సైన్యం నుంచి పంపించాలని కోరాము. వీలైనంత త్వరగా వెనక్కు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాము’’ అని అన్నారు. అయితే, రష్యాలో సైన్యంలో సహాయక విధుల్లో ఉన్న 10 మంది భారతీయులను వెనక్కు తీసుకొచ్చామని భారత విదేశాంగ శాఖ ఏప్రిల్ లో వెల్లడించింది.  

ఉక్రెయిన్ యుద్ధంలో వేల మంది రష్యన్లు మరణిస్తుండటంతో దక్షిణాసియా దేశాల వారిని రష్యా సైన్యం నియమించుకుంటోంది. భారతీయులతో పాటు నేపాల్ వారిని కూడా తమ సైన్యంలో చేర్చుకుంటోంది. గతేడాది నుంచి ఇప్పటివరకూ మొత్తం 200 మంది రష్యా సైన్యంలోని సహాయక విధుల్లో చేరినట్టు తెలుస్తోంది. వీళ్లందరినీ యూట్యూబ్ వీడియోల ద్వారా అధిక శాలరీలు ఆశ చూపి ఉచ్చులోకి దింపినట్టు తెలుస్తోంది. రష్యా సైన్యంలో సహాయక విధుల్లో ఉద్యోగాలంటూ మభ్యపెట్టినట్టు సమాచారం.

 తీరా విధుల్లో చేరాక తమకు ఆయుధ వినియోగంపై శిక్షణ ఇచ్చి యుద్ధ రంగంలోకి దింపుతున్నారంటూ కొందరు స్వదేశంలోని తమ కుటుంబసభ్యులకు ఫోన్లు చేసి ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయుల అక్రమ నియామకాల కుంభకోణంలో పాలుపంచుకుంటున్న నలుగురిని సీబీఐ గత నెలలో అరెస్టు చేసింది. ఇందులో రష్యా రక్షణ శాఖలోని కాంట్రాక్ట్ ఉద్యోగి కూడా ఉండటం గమనార్హం.
Indians In Russian Army
2 dead
Russia
Ukraine Conflict
India

More Telugu News