Chandrababu: చంద్రబాబును కలిసేందుకు ఐపీఎస్ ల ప్రయత్నం.. అడ్డుకున్న పోలీసులు

Senior IPS Officers Denied Permission To Meet Chandrababu

  • కారులో వచ్చిన సీఐడీ చీఫ్ సంజయ్.. కరకట్ట వద్దే ఆపేసిన సిబ్బంది
  • ఉదయం చంద్రబాబు నివాసానికి పీఎస్ఆర్.. తిప్పిపంపిన సెక్యూరిటీ
  • ఫోన్ లో అపాయింట్ మెంట్ కోరిన కొల్లి రఘురామిరెడ్డికి చుక్కెదురు

ఆంధ్రప్రదేశ్ కి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు పార్టీ నేతలు, అధికారులు ఆయన నివాసానికి క్యూ కడుతున్న విషయం తెలిసిందే. అయితే, గురువారం మాత్రం పలువురు ఐపీఎస్ అధికారులను చంద్రబాబు సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. అనుమతిలేదంటూ గేటు వద్ద నుంచే తిప్పి పంపారు. ఇందులో సీఐడీ చీఫ్ సంజయ్, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ కొల్లి రఘురామిరెడ్డి ఉన్నారు.

ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక సెలవు పెట్టి విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన సీఐడీ చీఫ్ సంజయ్ గురువారం చంద్రబాబు నివాసానికి వచ్చారు. కరకట్ట గేటు వద్ద ఆపిన సెక్యూరిటీ సిబ్బందికి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చినట్లు చెప్పగా.. ఉన్నతాధికారులకు వారు సమాచారం అందించారు. అయితే, సంజయ్ ను కలిసేందుకు అనుమతి లేదని జవాబు రావడంతో సెక్యూరిటీ సిబ్బంది వెనక్కి పంపారు.

గురువారం ఉదయం ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు కూడా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్దకు చేరుకున్నారు. ఆయనను కూడా అడ్డుకున్న సిబ్బంది.. చంద్రబాబును కలిసేందుకు అనుమతి లేదని చెప్పారు. దీంతో చేసేదేంలేక పీఎస్ఆర్ వెనక్కి వెళ్లిపోయారు. 

సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ కొల్లి రఘురామిరెడ్డి ఫోన్ లో చంద్రబాబు అపాయింట్ మెంట్ కోరారు. అధికారులు ఆయన విజ్ఞప్తిని తిరస్కరించారు. దీంతో కాబోయే సీఎంను కలుసుకోవడానికి కొల్లి రఘురామిరెడ్డి చేసిన ప్రయత్నం విఫలమైంది.

కాగా, ఈ ముగ్గురు సీనియర్ అధికారులపై అసెంబ్లీ ఎన్నికల సమయంలో తీవ్ర ఆరోపణలు రావడం గమనార్హం. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలతో వీరిపై ఎన్నికల సంఘం వేటు వేసింది. ప్రాధాన్య పోస్టుల నుంచి తప్పించి, ఇతర శాఖలకు పంపించింది. అనధికారికంగా వైసీపీ కోసం పనిచేశారనే ఆరోపణలతో పీఎస్ఆర్ పై ఎన్నికల సంఘం వేటు వేసింది. ఇక నంద్యాలలో చంద్రబాబును అరెస్టు చేసే సమయంలో కొల్లి రఘురామిరెడ్డి కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

Chandrababu
IPS Officers
Meet
Undavalli
Chandrababu Home
karakatta
PSR
Kolli
Sanjay
  • Loading...

More Telugu News