Akasa Air: 'ఆకాశ' విమానానికి బాంబు బెదిరింపు.. అహ్మదాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్

Delhi Mumbai Akasa Air flight diverted to Ahmedabad over bomb threat
  • ఢిల్లీ నుంచి 186 మంది ప్రయాణికులతో ముంబైకి బయలుదేరిన విమానం
  • ఈ నెలలో ఇది మూడో ఘటన
  • విమానాన్ని ల్యాండ్ చేసి ప్రయాణికులను ఖాళీ చేయించిన సిబ్బంది
  • ఈ నెల 1న ఇండిగో, 2న విస్తారా విమానాలకు బాంబు బెదిరింపు
విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. తాజాగా, ఆకాశ ఎయిర్‌ విమానానికి బాంబు బెదిరింపు రావడంతో దానిని అహ్మదాబాద్ మళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ ఉదయం 186 మంది ప్రయాణికులతో ఆకాశ ఎయిర్ విమానం క్యూపీ 1719 ఢిల్లీ నుంచి ముంబైకి బయలుదేరింది. విమానం గాల్లో ఉండగా బాంబు ఉన్నట్టు కెప్టెన్‌‌కు సెక్యూరిటీ అలెర్ట్ వచ్చింది. 

వెంటనే అప్రమత్తమైన కెప్టెన్ విషయాన్ని అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులకు చేరవేసి అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరాడు. అక్కడి నుంచి అనుమతి రాగానే వెంటనే విమానాన్ని మళ్లించి 10.13 గంటలకు సురక్షితంగా ల్యాండ్ చేశాడు. ఆ వెంటనే ప్రయాణికులను ఖాళీ చేయించి తనిఖీలు ప్రారంభించారు. కాగా, బాంబు బెదిరింపు ఘటనలో ఈ మూడు రోజుల్లో ఇది మూడోది కావడం గమనార్హం. 

అంతకుముందు పారిస్ నుంచి 306 మంది ప్రయాణికులతో ముంబై వస్తున్న విస్తారా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో నిన్న ఉదయం 10.19 గంటలకు అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఆ తర్వాత వారణాసి నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానానికి కూడా శనివారం బాంబు బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. గత నెల 28న ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానాన్ని పేల్చేస్తున్నట్టు తెల్లవారుజామునే ఫోన్‌కాల్ వచ్చింది. ఆ తర్వాత నిర్వహించిన తనిఖీల్లో లేవటరీలో ‘బాంబ్’ అని రాసి ఉన్న ఓ టిష్యూ పేపర్ కనిపించింది.
Akasa Air
Delhi
Mumbai
IndiGo
Vistra
Bomb Threat
Ahmedabad

More Telugu News