Donald Trump: నేను జైలుకు వెళ్లేందుకు సిద్ధమే: డొనాల్డ్ ట్రంప్

Donald Trump ready for jail in hush money case
  • హష్ మనీ కేసులో దోషిగా తేలిన ట్రంప్
  • జులై 11న ట్రంప్ కు శిక్ష విధించనున్న కోర్టు
  • తను జైలు పాలైతే ప్రజలు తట్టుకోలేరని వ్యాఖ్య
శృంగార తారకు డబ్బు చెల్లింపులు, దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆర్థిక రికార్డుల తారుమారు కేసులో దోషిగా తేలిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను జైలుకు వెళ్లేందుకు సిద్ధమేనని అన్నారు. ట్రంప్ పై నమోదైన 34 కేసుల్లో కోర్టు ఆయనను దోషిగా తేల్చింది. ఈ సందర్భంగా ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు. 

‘‘నేను జైలుకు వెళ్లేందుకు సిద్ధమే. ఓ అధ్యక్షుడిని జైలుకు పంపించడం ఏంటని నా లాయర్లు టీవీల్లో ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఎవరినీ వేడుకోవాల్సిన అవసరం లేదని నేను వారితో చెప్పాను. ఎలా జరగాలని ఉంటే అదే జరుగుతుంది’’ అని ట్రంప్ అన్నారు. అయితే, తాను జైలుకు వెళ్లడాన్ని ప్రజలు అస్సలు తట్టుకోలేరని హెచ్చరించారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికల్లో విజయం సాధిస్తే ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకున్నట్టు అవుతుందని అన్నారు. 

ఏమిటీ హష్ మనీ కేసు
డొనాల్డ్ ట్రంప్ తనతో ఒకప్పుడు ఏకాంతంగా గడిపారని శృంగార తార స్టార్మీ డేనియల్స్ గతంలో సంచలన ఆరోపణలు చేసింది. 2016 అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా ఉండేందుకు ట్రంప్ తనకు న్యాయవాది ద్వారా 1.30 లక్షల డాలర్ల హష్ మనీ డబ్బు ఇచ్చారని చెప్పుకొచ్చింది. ప్రచార కార్యక్రమాల ద్వారా అందిన విరాళాల నుంచి ఈ మొత్తాన్ని ఇచ్చారని, ఇందు కోసం రికార్డులను తారుమారు చేశారని ట్రంప్ పై ఉన్న ప్రధాన ఆరోపణ. 

ఈ కేసులో 12 మంది సభ్యులున్న జ్యూరీ.. ట్రంప్ ను దోషిగా తేలుస్తూ మే 31న చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. దాదాపు ఆరు వారాల పాటు సాగిన విచారణలో డేనియల్స్ సహా మొత్తం 22 మంది సాక్షులను కోర్టులో విచారించారు. జులై 11న ట్రంప్‌కు శిక్ష ఖరారు కానుంది. అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిగా ట్రంప్ ను రిపబ్లికన్ పార్టీ ఖరారు చేయడానికి సరిగ్గా నాలుగు రోజుల ముందు ట్రంప్ కు న్యాయస్థానం శిక్ష విధించనుంది. ఈ నేపథ్యంలో తదుపరి ఏం జరుగుతుందనే దానిపై అమెరికాలో ఉత్కంఠ నెలకొంది.
Donald Trump
Hush Money Case
Ready for Jail
USA

More Telugu News