అప్పుడు నా కళ్ళెంట నీళ్లొచ్చాయ్: సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు
- తనదైన విలనిజంతో మెప్పించిన కోట
- జంధ్యాల .. బాపు .. రమణలను గుర్తుచేసుకున్న నటుడు
- నిన్నటి హాస్యం తల్లిపాలలాంటిదని వెల్లడి
- నేటి కామెడీ డబ్బా పాలవంటిదని వ్యాఖ్య
"ఒకసారి నేను బాపు గారి సినిమాలో చేస్తున్నాను .. ఆ పక్కనే రమణగారు ఉన్నారు. నేను డైలాగ్ చెప్పలేకపోతున్నాను. నేను ఇబ్బందిపడుతుండటం చూసిన రమణగారు నన్ను పిలిచారు. నాతో పాటువచ్చి బాపుగారు కూడా అక్కడ కూర్చున్నారు. 'ఈ బాపుగారు .. నేను .. నీ ఫ్యాన్సయ్యా ' అని రమణగారు అన్నారు. ఆ మాటకి నాకు ఒక్క సారిగా కళ్లవెంట నీళ్లు వచ్చాయి. ఆ తరువాత 'పద్మశ్రీ' వచ్చినంత ఆనందమేసింది'' అని అన్నారు.
ఆ తరువాత బాపు - రమణ గారి గురించి ఒక సందర్భంలో నన్ను మాట్లాడమంటే ఏం మాట్లాడను? తెలుగు చూడాలంటే బాపు .. తెలుగు వినాలంటే రమణగారు అని అన్నాను. ఎవరైనా .. ఎప్పుడైనా .. ఎక్కడైనా .. ఏ వయసులో ఉన్నవారైనా చెప్పుకుని నవ్వుకునేలా ఉండేది హాస్యం. ఒకప్పుడున్నది హాస్యం .. ఇప్పుడున్నది కామెడీ. ఆనాటి హాస్యం తల్లిపాలలాంటిది .. ఇప్పుడున్న కామెడీ డబ్బాపాలవంటిది" అని చెప్పారు.