Royal Challengers: ఆర్సీబీ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్‌లో విజేతపై గవాస్కర్ అంచనా ఇదే

Royal Challengers Bangaluru will walk all over Rajastan Royals
  • రాజస్థాన్‌పై ఆర్సీబీ ఏకపక్ష విజయం సాధించే అవకాశం ఉందన్న సన్నీ
  • రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో లోపాలు ఉన్నాయన్న గవాస్కర్
  • ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరుకున్న విధానం అద్భుతమన్న టీమిండియా మాజీ దిగ్గజం
ఐపీఎల్-2024 ముగింపునకు మరో మూడు మ్యాచ్‌లు మాత్రమే మిగిలివున్నాయి. గత రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఫైనల్ చేరుకుంది. ఇక నేటి (బుధవారం) రాత్రి రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య అత్యంత కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్ర్కమిస్తుంది. ఇక గెలిచిన జట్టు క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడాల్సి ఉంటుంది. 

కాగా ఆర్సీబీ వర్సెస్ రాజస్థాన్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్‌పై టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కోల్‌కతా నైట్ రైడర్స్ మాదిరిగా రాజస్థాన్ రాయల్స్ ప్రత్యేక ప్రదర్శన చేయకపోతే ఆర్సీబీ ఏకపక్ష విజయం సాధించడం ఖాయమని సన్నీ విశ్లేషించారు. రాజస్థాన్ తన చివరి నాలుగైదు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైందని, వర్షం కారణంగా చివరి లీగ్ మ్యాచ్‌ను కూడా ఆడలేకపోయిందని, దీంతో ఆ జట్టు ప్రాక్టీస్‌కు దూరంగా ఉందని గవాస్కర్ పేర్కొన్నారు. రాజస్థాన్ మాదిరిగానే కోల్‌కతా ఆటగాళ్లు కూడా 11 రోజులపాటు ఆటకు దూరంగా ఉన్నా అద్భుతంగా ఆడారని, అదే స్థాయిలో రాజస్థాన్ రాణించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 

ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్ చేరుకున్న విధానం అద్భుతానికి ఏమాత్రం తక్కువకాదని గవాస్కర్ కొనియాడారు. ఆర్సీబీ ఇదే రీతిలో ఆడితే ఎలిమినేటర్ మ్యాచ్ వన్‌సైడ్ అవుతుందనేది తన భయమని, ఒకవేళ అలా జరగకపోతే తాను ఆశ్చర్యపోతానని గవాస్కర్ అన్నారు. గత నాలుగు మ్యాచ్‌లను గమనిస్తే రాజస్థాన్ రాయల్స్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్‌ విభాగాల్లో బలహీనతలు బయటపడ్డాయని గవాస్కర్ విశ్లేషించారు. జోస్ బట్లర్ మధ్యలోనే స్వదేశం వెళ్లిపోవడం ఆ జట్టు బ్యాటింగ్‌ను దెబ్బతీసిందని, దీంతో యశస్వి జైస్వాల్, కెప్టెన్ శాంసన్, రియాన్ పరాగ్‌లపై మాత్రమే ఆ జట్టు ఆధారపడిందని పేర్కొన్నారు. కాబట్టి ఆర్సీబీ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ ఏకపక్షంగా సాగుతుందని అంచనా వేశారు.

ఇక ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరుకున్న విధానంపై గవాస్కర్ ప్రశంసల జల్లు కురిపించారు. తిరిగి పుంజుకోగలమని ఆర్సీబీ జట్టు నమ్మడం చాలా గొప్ప విషయమని గవాస్కర్ వ్యాఖ్యానించారు. ఆర్సీబీ దిగ్గజాలైన ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, ఇతర సీనియర్ ఆటగాళ్లు ఇతర ప్లేయర్లను ప్రోత్సహించారని ప్రస్తావించారు. కాగా కోల్‌కతా వర్సెస్ హైదరాబాద్ జట్ల మధ్య క్వాలిఫయర్-1 మ్యాచ్ ముగిసిన అనంతరం సన్నీ ఈ విధంగా విశ్లేషించారు.
Royal Challengers
Rajastan Royals
RCB Vs RR
IPL 2024
Cricket
Eliminator Match

More Telugu News