Harish Rao: నర్సింగ్ ఆఫీసర్లకు 4 నెలలుగా జీతాలేవీ?: హరీశ్ రావు

ex minister harish rao fires on congress government over non payment of salaries to healthcare workers

  • కాంగ్రెస్ సర్కార్ వారిని గాలికి వదిలేసిందని మండిపాటు
  • జీతభత్యాల గురించి పట్టించుకోవడం లేదని ఆగ్రహం
  • జీతాలు అందక 4 వేల మంది మెడికల్ ఆఫీసర్లు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన
  • సామాజిక వేదిక ‘ఎక్స్’ ద్వారా ప్రభుత్వ వైఖరిని ఎండగట్టిన మాజీ మంత్రి

కొత్తగా నియమితులైన నర్సింగ్ ఆఫీసర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం 4 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన 7 వేల మంది నర్సింగ్ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ ఘనతను తన ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ సర్కార్ వారిని ఏమాత్రం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. దీనిపై సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.

‘ఎల్బీ స్టేడియం వేదికగా అట్టహాసంగా నియామక పత్రాలు అందించి గాలికి వదిలేసింది తప్ప, వారి జీత భత్యాల గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. దీంతో డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో నియమితులైన 4 వేల మంది నర్సింగ్ ఆఫీసర్లకు జీతాలు అందక అష్టకష్టాలు పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నట్లు లేని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించాలి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్‌లో ఉన్న నాలుగు నెలల జీతాలును తక్షణం చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను’ అని హరీశ్ రావు తన పోస్ట్ లో పేర్కొన్నారు.

తన పోస్ట్ లో డీఎంఈ తెలంగాణను ట్యాగ్ చేశారు. అలాగే కాంగ్రెస్ ఫెయిల్డ్ తెలంగాణ, కాంగ్రెస్ ఫెయిల్స్ తెలంగాణ పేర్లతో హ్యాష్ ట్యాగ్ లను జత చేశారు.

Harish Rao
BRS Leader
Telangana
Congress Government
Nursing Officers
  • Loading...

More Telugu News