Rohit Sharma: క్రికెటర్ల జీవితాలంటే అంత చులకనా?... స్టార్ స్పోర్ట్స్ చానల్ పై రోహిత్ శర్మ అసంతృప్తి

Rohit Sharma disappointed with Star Sports Channel
  • ముంబయి ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మకు ఇదే చివరి సీజన్ అంటూ ప్రచారం
  • అభిషేక్ నాయర్ తో రోహిత్ శర్మ సంభాషణ వీడియో వైరల్
  • ఆ వీడియో ప్రసారం చేయవద్దని తాను స్టార్ స్పోర్ట్స్ ను కోరానన్న హిట్ మ్యాన్
  • కానీ వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘిస్తూ వీడియో ప్రసారం చేశారని ఆగ్రహం
ఐపీఎల్ తాజా సీజన్ లో ముంబయి ఇండియన్స్ దారుణ ప్రదర్శన కనబర్చిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి, కొత్త కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను నియమించడం దారుణంగా బెడిసికొట్టింది. 

కాగా, రోహిత్ శర్మకు ముంబయి ఇండియన్స్ తరఫున ఇదే చివరి సీజన్ అంటూ ప్రచారం జరుగుతుండగా, ఇటీవల తన స్నేహితుడు అభిషేక్ నాయర్ తో రోహిత్ శర్మ సంభాషణ బయటికి వచ్చింది. జరుగుతున్న ప్రచారానికి ఊతమిచ్చేలా ఆ సంభాషణ ఉంది. 

ఈ నేపథ్యంలో, ఐపీఎల్ అధికారిక ప్రసారకర్త స్టార్ స్పోర్ట్స్ చానల్ పై హిట్ మ్యాన్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. క్రికెటర్ల జీవితాలంటే లెక్కలేకుండా పోయిందని ఆవేదన వెలిబుచ్చాడు. 

స్నేహితులతో ముచ్చటిస్తున్నా, సహచర క్రికెటర్లతో మాట్లాడుతున్నా, ప్రాక్టీసు చేస్తున్నా, మ్యాచ్ రోజున కానీ మేం మాట్లాడే ప్రతి మాటను రికార్డు చేస్తున్నారు... కెమెరాలన్నీ మాపైనే ఉంటున్నాయి అంటూ ఆక్రోశించాడు. 

"మొన్న ఇలాగే ఒక సంభాషణను రికార్డ్ చేయవద్దని స్టార్ స్పోర్ట్స్ ను కోరాను... కానీ నా విజ్ఞాపనను పట్టించుకోకుండా ఆ సంభాషణ తాలూకు వీడియోను ప్రసారం చేశారు. ఇది కచ్చితంగా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే. ప్రత్యేకమైన కంటెంట్ కోసం పాకులాడుతూ, కేవలం వ్యూస్ కోసమే అన్నట్టుగా వ్యవహరిస్తే, అది ఏదో ఒకరోజున అభిమానులకు, క్రికెటర్లకు మధ్య ఉన్న నమ్మకాన్ని విచ్ఛిన్నం చేస్తుంది... ఇకనైనా మంచితనాన్ని నిలుపుకుందాం" అంటూ రోహిత్ శర్మ పిలుపునిచ్చాడు.
Rohit Sharma
Star Sports
Video
Mumbai Indians
IPL 2024

More Telugu News