RCB: అన్నంత పనీ చేసిన ఆర్సీబీ... చెన్నైని ఇంటికి పంపి ప్లేఆఫ్స్ లోకి ఎంట్రీ

RCB enters into IPL Play Offs by knocked out CSK

  • ఐపీఎల్ లో రోమాంఛక మ్యాచ్
  • 27 పరుగుల తేడాతో సీఎస్కేను మట్టికరిపించిన ఆర్సీబీ
  • 219 పరుగుల ఛేదనలో 191/7 పరుగులు చేసిన చెన్నై
  • 201 పరుగులు చేసినా చెన్నై జట్టు ప్లేఆఫ్స్ లోకి వెళ్లే చాన్స్ 
  • ఆఖరి ఓవర్ ను అద్భుతంగా విసిరి కేవలం 7 పరుగులే ఇచ్చిన యశ్ దయాళ్

ఐపీఎల్ 17వ సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్రస్థానం నిజంగా ఓ అద్భుతం. వరుసగా ఆరు మ్యాచ్ ల్లో ఓటమిపాలైన ఆ జట్టు, అక్కడ్నించి వరుసగా ఆరు మ్యాచ్ ల్లో నెగ్గి ప్లేఆఫ్స్ లోకి ప్రవేశించడం సామాన్యమైన విషయం కాదు. నేడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై సాధించిన విజయం ఆ జట్టు అచంచలమైన పట్టుదలకు నిదర్శనం.

ప్లేఆఫ్స్ చేరాలంటే 18 పరుగుల తేడాతో చెన్నైని మట్టికరిపించాలన్న సమీకరణం నేపథ్యంలో... ఆర్సీబీ పోరాటపటిమ ప్రదర్శించి అన్నంత పనీ చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 218 పరుగులు చేసింది. 219 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సీఎస్కే జట్టును 191/7పరుగులకే పరిమితం చేసింది. తద్వారా 27 పరుగులతో మ్యాచ్ లో విజయాన్ని, ప్లేఆఫ్స్ బెర్తును కైవసం చేసుకుంది. 

రచిన్ రవీంద్ర (61), అజింక్యా రహానే (33), రవీంద్ర జడేజా (42 నాటౌట్), ధోనీ (25) మినహా చెన్నై జట్టులో పెద్దగా రాణించిన వాళ్లు లేరు. మ్యాచ్ సమీకరణం ప్రకారం... 201 పరుగులు చేస్తే చెన్నై జట్టు ప్లేఆఫ్స్ లోకి ప్రవేశించడం ఖాయం కాగా... ఓ దశలో చెన్నై జట్టు భయపెట్టింది. మ్యాచ్ లో ఓడిపోయినా ప్లేఆఫ్స్ బెర్తు దక్కించుకునే గోల్డెన్ చాన్స్ చెన్నై ముందు నిలిచింది.

ప్లేఆఫ్స్ బెర్తు కోసం (విజయం కోసం కాదు) చెన్నై చివరి ఓవర్లో 6 బంతుల్లో 17 పరుగులు చేయాల్సి ఉండగా... యశ్ దయాళ్ విసిరిన ఆ ఓవర్ తొలి బంతికి ధోనీ ఓ సిక్స్ కొట్టి ప్రమాద ఘంటికలు మోగించాడు. కానీ ఆ తర్వాతి బంతికి ధోనీ అవుట్ కావడంతో బెంగళూరు జట్టు ఊపిరి పీల్చుకుంది. 

ఆ తర్వాత బరిలో దిగిన శార్దూల్ ఠాకూర్ భారీ షాట్లు ఆడలేకపోయాడు. శార్దూల్ ఓ సింగిల్ తీయడంతో బ్యాటింగ్ క్రీజులోకి వచ్చిన జడేజా సైతం చివరి రెండు బంతుల్లో ఒక్క పరుగు తీయలేకపోయాడు. మొత్తమ్మీద యశ్ దయాళ్ ఆ ఓవర్ లో కేవలం 7 పరుగులు ఇచ్చి ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించాడు.  

దాంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు రైట్ రాయల్ గా ప్లేఆఫ్స్ లోకి ప్రవేశించింది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కథ ఈసారి లీగ్ దశలోనే ముగిసింది. బెంగళూరు బౌలర్లలో యశ్ దయాళ్ 2, గ్లెన్ మ్యాక్స్ వెల్ 1, సిరాజ్ 1, ఫెర్గుసన్ 1, కామెరాన్ గ్రీన్ 1 వికెట్ తీశారు. 

ప్రస్తుతానికి ప్లేఆఫ్స్ చూస్తే... మొదటి స్థానంలో కోల్ కతా నైట్ రైడర్స్, రెండో స్థానంలో రాజస్థాన్ రాయల్స్, మూడో స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్, నాలుగో స్థానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఉన్నాయి. 

రేపు (మే 19) సన్ రైజర్స్ × పంజాబ్ కింగ్స్... రాజస్థాన్ రాయల్స్ × కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ మ్యాచ్ ల ఫలితాల అనంతరం ప్లేఆఫ్స్ లో ఎవరు ఎవరితో ఆడతారన్నది స్పష్టత వస్తుంది.

  • Loading...

More Telugu News