Hyderabadi dead In USA: ప్రమాదంలో నుంచి బయటపడిన కాసేపటికే మరో ప్రమాదం.. అమెరికాలో హైదరాబాదీ దుర్మరణం

Telangana Software Engineer Dies in Road Accident in US

  • వర్షంలో ప్రయాణిస్తుండగా కారు అదుపు తప్పి మరో కారును ఢీ కొట్టిన వైనం
  • ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో బతికిబయటపడ్డ టెకీ
  • ప్రమాదంపై పోలీసులకు ఫోన్ చేస్తుంటే ఢీ కొట్టిన మరో కారు.. స్పాట్ లోనే దుర్మరణం

అమెరికాలోని నార్త్ కరోలినాలో ఘోర ప్రమాదం జరిగింది. హైవేపై వేగంగా దూసుకొచ్చిన కారు ఢీ కొట్టడంతో హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ దుర్మరణం పాలయ్యాడు. అంతకుముందే జరిగిన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ యువకుడు.. నిమిషాల వ్యవధిలోనే మరో యాక్సిడెంట్ లో ప్రాణం కోల్పోయాడు. నార్త్ కరోలినా పోలీసులు, బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన అబ్బరాజు పృథ్వీరాజు (30) అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ గా పనిచేస్తున్నాడు. ఎనిమిదేళ్లుగా నార్త్ కరోలినాలో నివాసం ఉంటున్నాడు. గతేడాది వివాహం చేసుకున్నాడు. భార్యాభర్తలు ఇద్దరూ సంతోషంగా కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో బుధవారం భార్య శ్రీప్రియతో కలిసి పృథ్వీరాజు కారులో బయటకు వెళ్లారు. ఇంటికి తిరిగి వస్తుండగా వర్షం కురవడంతో కారు అదుపుతప్పి ముందు వెళుతున్న కారును వేగంగా ఢీ కొట్టింది. దీంతో ఆ కారు పల్టీ కొట్టింది.

 పృథ్వీరాజు కారులో ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో ఈ ప్రమాదం నుంచి భార్యాభర్తలు ఇద్దరూ క్షేమంగా బయటపడ్డారు. ఈ ప్రమాదం గురించి పోలీసులకు సమాచారం అందించేందుకు పృథ్వీరాజు కారు దిగి ఫోన్ చేస్తుండగా వెనక నుంచి దూసుకొచ్చిన మరో కారు ఆయనను ఢీ కొట్టింది. దీంతో పృథ్వీరాజు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కాగా, పృథ్వీరాజ్ మృతదేహాన్ని హైదరాబాద్ కు తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

Hyderabadi dead In USA
North Carolina
Car Accident
NRI
America News
  • Loading...

More Telugu News