Anita Goyal: జెట్ ఎయిర్‌వేస్ ఫౌండర్ నరేశ్ గోయల్ భార్య కన్నుమూత

Anita Goyal wife of Naresh Goyal deis of cancer in Mumbai hospital
  • సుదీర్ఘకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న అనితా గోయల్
  • ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందిన అనిత
  • ఇటీవలే రెండు నెలల మధ్యంతర బెయిలుపై నరేశ్ గోయల్
  • ఆయన సమక్షంలోనే కన్నుమూసిన భార్య అనిత
విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ భార్య అనితా గోయల్ ఈ తెల్లవారుజామున 3 గంటల సమయంలో కన్నుమూశారు. సుదీర్ఘ కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.  ఇటీవలే మధ్యంతర బెయిలుపై బయటకు వచ్చిన నరేశ్ గోయల్ సమక్షంలోనే ఆమె తుదిశ్వాస విడిచారు. 

నరేశ్ గోయల్ కూడా కేన్సర్‌తో బాధపడుతున్నారు. నరేశ్ గోయల్ ‘జీవించాలన్న ఆశ’ను కోల్పోయారని, ఆయనకు మెడికల్ బెయిల్ ఇవ్వాలని కోరుతూ గోయల్ తరపు న్యాయవాది ఈ నెల 3న బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై తీర్పును రిజర్వు చేసిన కోర్టు.. గోయల్ చికిత్స పొందుతున్న ఆసుపత్రి నుంచి మే 6 వరకు డిశ్చార్జ్ చేయవద్దని ఆదేశాలు జారీచేసింది.  6న రెండు నెలల మధ్యంతర బెయిలు మంజూరు చేసింది.
   
మనీలాండరింగ్ ఆరోపణలపై నరేశ్ గోయల్ సెప్టెంబర్ 2023లో అరెస్ట్ అయ్యారు. కెనరా బ్యాంకు నుంచి తీసుకున్న మొత్తం రుణంలో రూ. 538.62 కోట్లు తిరిగి చెల్లించడంలో ఆయన విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనపై కేసు నమోదైంది. ఇదే కేసులో గోయల్ భార్య అనితా గోయల్ నవంబరు 2023లో అరెస్ట్ అయ్యారు. అయితే, ఆమె వయసు, ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అరెస్ట్ అయిన రోజే ఆమెకు బెయిలు మంజూరైంది. కాగా, అనిత అంత్యక్రియలు నేటి సాయంత్రం జరగనున్నాయి.
Anita Goyal
Naresh Goyal
Jet Airways
Mumbai Hospital
Cancer

More Telugu News