Unhealthy Home made Food: ఇంట్లో ఇలాంటి వంటలు చేసుకున్నా ప్రమాదమే.. ఐసీఎమ్ఆర్ హెచ్చరిక

Even food made at home can be unhealthy Medical body ICMR explains

  • అధిక కొవ్వులు, ఉప్పు ఉన్న ఆహార పదార్థాలు ఇంట్లో చేసుకున్నా నష్టమేనన్న ఐసీఎమ్ఆర్
  • వీటితో పోషకాల కొరత ఏర్పడుతుందని హెచ్చరిక
  • దీర్ఘకాలంలో ఈ ఆహారంతో జీవనశైలి వ్యాధుల బారిన పడాల్సి వస్తుందని వార్నింగ్
  • కేలరీలకు పోషకాలు తోడైనప్పుడే అది హితకర ఆహారంగా మారుతుందన్న ఐసీఎమ్ఆర్

ఇళ్లల్లో కొందరు నూనె, నెయ్యి వంటివి బాగా దట్టించి వంటలు చేసుకుంటూ ఉంటారు. ఇళ్లల్లో చేసుకునే ఇలాంటి వంటకాలతో ఎటువంటి ప్రమాదం ఉండదని కూడా భావిస్తూ ఉంటారు. కానీ ఈ ధోరణి తప్పని భారత వైద్య పరిశోధన మండలి స్పష్టం చేసింది. ఆరోగ్యకరమైన ఆహారంపై తాజాగా పలు మార్గదర్శకాలు జారీ చేసిన ఐసీఎమ్ఆర్.. అధిక కొవ్వులు ఉండే ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. వీటితో పోషకాల లేమి ఏర్పడి చివరకు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడాల్సి వస్తుందని హెచ్చరించింది. 

ఐసీఎమ్ఆర్ ప్రకటన ప్రకారం, కొవ్వులు, ఉప్పు అధికంగా ఉన్న ఆహారంతో ఊబకాయం బారినపడతారు. ‘‘ఇలాంటి ఫుడ్స్ ద్వారా శరీరానికి కావాల్సిన అమైనో యాసిడ్స్, ఫ్యాట్స్, ఫైబర్ వంటి మాక్రోన్యూట్రియంట్స్, విటమిన్లు, మినరల్స్ వంటి ఫైటోన్యూట్రియంట్స్ తగిన మోతాదుల్లో అందవు. మైక్రో, మాక్రో పోషకాలలేమి కారణంగా రక్తహీనత, మెదడు సామర్థ్యం తగ్గడం, కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఇబ్బందులు, డయాబెటిస్, ఊబకాయం వంటి జీవనశైలి వ్యాధులు వస్తాయి. కొవ్వులు, ఉప్పు అధికంగా ఉండే ఆహారంతో పేగుల్లోని హితకర బ్యాక్టీరియాపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఉప్పు ఎక్కువగా తింటే బీపీ పెరుగుతుంది. ఇది కిడ్నీలపై ప్రభావం చూపిస్తుంది ’’ అని ఐసీఎమ్ఆర్ పేర్కొంది. కొవ్వులు, ఉప్పు అధికంగా ఉన్న ఆహారాల్లో కేలరీలు ఎక్కువగా, పోషకాలు తక్కువగా ఉంటాయని పేర్కొంది. నెయ్యి, నూనె, బటర్, పామ్ ఆయిల్, వనస్పతిల్లో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయని, ఇవి పలు అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయని హెచ్చరించింది. 

ఐసీఎమ్ఆర్ మార్గదర్శకాల ప్రకారం, రోజుకు 10 గ్రాములకు మించి సంతృప్తకర కొవ్వులు తీసుకోవడం అనారోగ్యకారకం. ఉప్పును కూడా రోజుకు 5 గ్రాములకు మించి తినకూడదు. ఇక చక్కెర కూడా రోజుకు 25 గ్రాములకు మించి తినకూడదు. కేలరీలకు విటమిన్లు, మినరల్స్, పీచు పదార్థం తోడైనప్పుడే అది ఆరోగ్యకరమైన ఆహారంగా మారుతుందని ఐసీఎమ్ఆర్ పేర్కొంది.

Unhealthy Home made Food
ICMR
Health
  • Loading...

More Telugu News