Rajasthan Royals: టాప్ ప్లేస్ కోల్పోయిన రాజస్థాన్ .. పంజాబ్ ఘనవిజయం!

Sam Curran all round heroics performence make Punjab Kings impressive win over Rajasthan Royals

  • రాజస్థాన్ రాయల్స్‌పై 5 వికెట్ల తేడాతో గెలిచిన పంజాబ్ కింగ్స్
  • 145 పరుగుల లక్ష్యం 18.5 ఓవర్లలో ఛేదన
  • బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించిన పంజాబ్ కెప్టెన్ సామ్ కర్రాన్

లీగ్ దశలో మిగిలివున్న రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి, ఐపీఎల్-2024 పాయింట్ల పట్టికలో నిలవాలనుకున్న రాజస్థాన్ రాయల్స్‌ ఆశలపై పంజాబ్ కింగ్స్ నీళ్లు చల్లింది. గువాహటి వేదికగా జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. రాజస్థాన్ నిర్దేశించిన 145 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి 18.5 ఓవర్లలోనే పంజాబ్ ఛేదించింది. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ సామ్ కర్రాన్ బ్యాటింగ్, బౌలింగ్‌ విభాగాల్లో అదరగొట్టి జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. లక్ష్య ఛేదనలో ఇతర బ్యాటర్లు తడబడ్డప్పటికీ సామ్ కర్రాన్ 41 బంతుల్లో 63 పరుగులు బాది జట్టుని విజయతీరాలకు చేర్చే వరకు క్రీజులోనే ఉన్నాడు. మిగతా బ్యాటర్లలో రూసో (22), జితేశ్ శర్మ (22), అశ్‌తోశ్ శర్మ (17 నాటౌట్), బెయిర్‌స్టో (14), శశాంక్ సింగ్ (0), ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (6) చొప్పున పరుగులు చేశారు.

రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో అవేశ్ ఖాన్, చాహల్ చెరో రెండు వికెట్లు, ట్రెంట్ బౌల్ట్ ఒక వికెట్ తీశారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో  9 వికెట్ల నష్టానికి 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. 34 బంతుల్లో 48 పరుగులు చేసిన రియాన్ పరాగ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లలో సామ్ కర్రాన్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్ తలో రెండేసి వికెట్లు తీశారు. అర్షదీప్ సింగ్, నాథన్ ఎల్లీస్ చెరో వికెట్ తీశారు. మరో వికెట్ రనౌట్ రూపంలో లభించింది.

కాగా ఈ ఓటమితో రాజస్థాన్ రాయల్స్‌కు వరుసగా నాలుగవ ఓటమి ఎదురైంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరుకున్న ఆ జట్టు అగ్రస్థానాన్ని దక్కించుకునే అవకాశాన్ని కోల్పోయింది. మిగిలివున్న రెండు మ్యాచ్‌ల్లో గెలిచివుంటే 20 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలిచివుండేది. కానీ పంజాబ్ కింగ్స్‌ చేతిలో ఓడిపోవడంతో మిగిలివున్న ఒక్క మ్యాచ్‌ గెలిచినా ఆ జట్టు ఖాతాలో 18 పాయింట్లే ఉంటాయి. ఇప్పటికే 19 పాయింట్లతో ఉన్న కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుని అధిగమించే అవకాశం లేదు. మరోవైపు పంజాబ్ కింగ్స్ జట్టు ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. అయితే రాజస్థాన్‌పై విజయంతో ఐపీఎల్ 2024లో 10వ స్థానం నుంచి 9వ స్థానానికి చేరింది.

  • Loading...

More Telugu News