Pulivarti Nani: పులివర్తి నానిపై దాడి చేసిన వాళ్లను గంటలో పట్టుకుంటాం: తిరుపతి ఎస్పీ

Tirupati SP Krishnakanth Patil said police will capture theattackers on Pulivarti Nani within one hour
  • తిరుపతిలో పులివర్తి నానిపై దాడి
  • కిమ్స్ లో చికిత్స పొందుతున్న నాని
  • నాని నుంచి స్టేట్ మెంట్ తీసుకున్న పోలీసులు
  • దాడికి పాల్పడిన వారిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు
తిరుపతిలో టీడీపీ నేత పులివర్తి నానిపై పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద వైసీపీ శ్రేణులు దాడి చేసిన ఘటనపై జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పాటిల్ స్పందించారు. చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆయనను కలిసి వచ్చానని ఎస్పీ వెల్లడించారు. 

ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నానని, ఆయన నుంచి స్టేట్ మెంట్ తీసుకున్నామని చెప్పారు. ఆయన కొందరి పేర్లను తమకు ఇచ్చారని, వారిని అరెస్ట్ చేసిన తర్వాత ఆ పేర్లను వెల్లడిస్తామని తెలిపారు. ఇప్పుడే తమ పోలీసు బృందాలకు సూచనలు ఇచ్చామని, వారిని గంటలో పట్టుకుంటామని ఎస్పీ కృష్ణకాంత్ పాటిల్ ధీమా వ్యక్తం చేశారు. ఈ దాడిలో పులివర్తి నాని గన్ మన్ కు కూడా గాయాలయ్యాయని వెల్లడించారు. 

పద్మావతి యూనివర్సిటీలోని ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతకు ఢోకా లేదని, అక్కడేమీ జరగలేదని స్పష్టం చేశారు. అయితే, ఎంతో భద్రత ఉందని చెబుతున్న పద్మావతి వర్సిటీలోకి కత్తులు, గొడ్డళ్లు, బీర్ బాటిళ్లు ఉన్న ఓ వాహనం ఎలా ప్రవేశించిందని మీడియా ప్రతినిధి ఒకరు ప్రశ్నించగా, ఎస్పీ సరిగా సమాధానం చెప్పలేకపోయారు. ఇక నన్నేమీ అడగకండి అంటూ సమాధానం దాటవేసేందుకు ప్రయత్నించారు.
Pulivarti Nani
Attack
SP Krishnakanth Patil
Tirupati
TDP
YSRCP

More Telugu News