TSRTC: ట్రాఫిక్ రూల్స్ పై ఈ పిల్లల అవగాహన అభినందనీయం: సజ్జనార్

vc sajjanar shares video on traffic compliance by school children

  • ‘ఎక్స్’ వేదికగా ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల వీడియోను షేర్ చేసిన టీఎస్ ఆర్టీసీ ఎండీ
  • పిల్లల్లో తల్లిదండ్రులు, టీచర్లు సామాజిక స్పృహ నింపాలని సూచన
  • యువత ర్యాష్ డ్రైవింగ్ కు పరోక్షంగా వారి తల్లిదండ్రులే కారణం అవుతున్నారని కామెంట్

 టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ తరచూ తన ‘ఎక్స్’ ఖాతాలో వీడియోలు పోస్ట్ చేస్తుంటారు.

తాజాగా ఆయన గురువారం తన ‘ఎక్స్’ ఖాతాలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేలా ఓ ప్రభుత్వ పాఠశాల పిల్లలు రూపొందించిన వీడియోను నెటిజన్లతో పంచుకున్నారు. ‘చిన్నతనంలో ట్రాఫిక్ రూల్స్ పై ఈ పిల్లలు అవగాహన కల్పిస్తోన్న తీరు అభినందనీయం. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల జరిగే అనర్ధాల గురించి ఒక్కొక్కటిగా పిల్లలకు అవగాహన కల్పించాలి. తల్లిదండ్రులు, టీచర్స్ వారిలో సామాజిక స్పృహను నింపాలి’ అని ఆ వీడియో కింద సజ్జనార్ కామెంట్ పోస్ట్ చేశారు. ఈ వీడియోను కేంద్ర రోడ్డు రహదారుల మంత్రిత్వ శాఖకు ట్యాగ్ చేశారు. అలాగే రోడ్, రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ రూల్స్ అనే పదాలతో హ్యాష్ ట్యాగ్ లను జత చేశారు.

ఈ వీడియోలో ముందుగా ఫోన్ చూస్తూ రోడ్డు దాటడం, జీబ్రా క్రాసింగ్ పైన కాకుండా దానికి కొంచెం ముందు నుంచే రోడ్డు దాటడం వల్ల ఎదురయ్యే ప్రమాదాలను పిల్లలు కళ్లకు కట్టినట్లు చూపారు. అదే ఒకవేళ రోడ్డు దాటేందుకు జీబ్రా క్రాసింగ్ మీద నడుస్తూ వాహనదారుడికి చేయి చూపిస్తే ప్రమాదాలు జరగకుండా ఎలా ఉంటాయో ప్రయోగాత్మకంగా చేసి చూపించారు.

ఆ తర్వాత రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఓవైపు పాదచారులు రోడ్డు దాటుతున్నా ఆగకుండా వాహనాన్ని పోనివ్వడం ఎంత ప్రమాదానికి దారితీస్తుందో విద్యార్థులు తెలియజేశారు. రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు ఆగి గ్రీన్ సిగ్నల్ వచ్చాక వాహనదారులు ముందుకు కదిలితే ఎంత సురక్షితంగా గమ్యం చేరొచ్చో విద్యార్థులు నటించి చూపారు.

అలాగే హెల్మెట్ ధరించకుండా ప్రమాదానికి గురైతే లేదా హెల్మెట్ ధరించినప్పుడు ప్రమాదం జరిగితే ఎలా క్షేమంగా బయటపడొచ్చో స్టూడెంట్స్ చూపారు. వీడియోలో చివరగా సెల్ ఫోన్ డ్రైవింగ్ ఎంత ప్రమాదకరమో విద్యార్థులు చూపించారు.

రోడ్లపై యువత చేస్తున్న స్టంట్ల గురించి బుధవారం పోస్ట్ చేసిన ఓ వీడియోలో సజ్జనార్ తెలియజేశారు. ‘యూత్ కి సోషల్ మీడియా పైత్యం పతాకస్థాయికి చేరుతోంది. ఫేమస్ కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఇలాంటి చిత్రవిచిత్ర పిచ్చి పనులు చేస్తున్నారు. కొందరు పిల్లలు ఇలా మారడానికి పరోక్ష కారణం తల్లిదండ్రులే. వారి పర్యవేక్షణ లోపం వల్లే రోడ్లపై ఇలాంటి వెర్రి వేషాలు వేస్తున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

TSRTC
Managing Director
vc sajjanar
Social Media
traffic rules
compliance
  • Loading...

More Telugu News