SRH: సొంతగడ్డపై సన్ రైజర్స్ కు పరాభవం... ఆర్సీబీ అద్భుత విజయం

RCB halts SRH winning streak
  • ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ × ఆర్సీబీ
  • 35 పరుగుల తేడాతో ఓటమిపాలైన సన్ రైజర్స్
  • 207 పరుగుల లక్ష్యఛేదనలో 171 పరుగులు చేసిన హైదరాబాద్ జట్టు
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో మ్యాచ్ అంటే ప్రత్యర్థి జట్లు భయపడుతున్న స్థితిలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అద్భుత విజయం నమోదు చేసింది. సొంతగడ్డపై ఆడుతున్న హైదరాబాద్ జట్టును 35 పరుగుల తేడాతో ఓడించింది. 

వరుసగా ఐదు మ్యాచ్ ల్లో నెగ్గి మాంచి ఊపుమీదున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇలా ఓడిపోతుందని అభిమానులెవరూ ఊహించలేదు. మామూలుగా ప్రతి మ్యాచ్ లో 250 పైచిలు స్కోర్లు కొడుతున్న సన్ రైజర్స్... ఆర్సీబీపై 207 పరుగుల లక్ష్యాన్ని ఈజీగా ఛేదిస్తుందనుకుంటే, ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 171 పరుగులే చేసి ఓటమిపాలైంది.

ట్రావిస్ హెడ్ (1), ఐడెన్ మార్ క్రమ్ (7), నితీశ్ రెడ్డి (13), హెన్రిచ్ క్లాసెన్ (7) విఫలం కావడం సన్ రైజర్స్ అవకాశాలను దెబ్బతీసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 31, కెప్టెన్ పాట్ కమిన్స్ 31, షాబాజ్ అహ్మద్ 40 (నాటౌట్) పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో స్వప్నిల్ సింగ్ 2, కర్ణ్ శర్మ 2, కామెరాన్ గ్రీన్ 2, విల్ జాక్స్ 1, యశ్ దయాళ్ 1 వికెట్ తీశారు. 

నేటి మ్యాచ్ ముందు వరకు తాను ఆడిన 8 మ్యాచ్ ల్లో 7 మ్యాచ్ లు ఓడిపోయిన బెంగళూరు జట్టు... సన్ రైజర్స్ ను ఓడించడం క్రికెట్ పండితులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.

ఇక, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తన తదుపరి మ్యాచ్ ను ఏప్రిల్ 28న చెన్నై సూపర్ కింగ్స్ తో ఆడనుంది. ఈ మ్యాచ్ చెన్నైలో జరగనుంది.
SRH
RCB
Hyderabad
IPL 2024

More Telugu News