Sri Rama Navami: జంటనగరాల్లో 24 గంటలపాటు మద్యం దుకాణాల బంద్.. షాపుల ముందు మద్యం ప్రియుల క్యూ

Liquor shops in Hyderabad and Secunderabad limits remain closed for 24 hours
  • రేపు శ్రీరామ నవమి సందర్భంగా మద్యం దుకాణాల బంద్
  • ఆదేశాలు జారీచేసిన హైదరాబాద్ సీపీ శ్రీనివాసరెడ్డి
  • నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక

శ్రీరామ నవమిని పురస్కరించుకుని రేపు ఉదయం ఆరు గంటల నుంచి ఎల్లుండి ఉదయం ఆరు గంటల వరకు జంట నగరాల్లో (హైదరాబాద్, సికింద్రాబాద్) మద్యం విక్రయాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు హైదరాబాద్ సీపీ శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ట్రై కమిషనరేట్ల పరిధిలోని మద్యం దుకాణాలు, కల్లు కాంపౌండ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్లలో మద్యం విక్రయాలు నిలిపివేయాలని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. శ్రీరామ నవమి సందర్భంగా 24 గంటలపాటు మద్యం దుకాణాలు మూతబడనున్నాయన్న వార్త తెలియడంతో మందుబాబులు ఈ ఉదయం నుంచే దుకాణాల ముందు క్యూకట్టారు. 

మరోవైపు, ఎండలు మండిపోతుండడంతో రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. మరీ ముఖ్యంగా బీర్లు ఒక రేంజ్‌లో అమ్ముడుపోతున్నాయి. ఎండల నుంచి ఉపశమనం కోసం చాలామంది చల్లని బీరు కోసం వైన్‌షాపుల ముందు క్యూ కడుతున్నారు. బీర్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో ఆ మేరకు సరఫరా చేయలేక దుకాణదారులు చేతులెత్తేస్తున్నారు.

సాధారణంగా ప్రధాన బ్రాండ్ల బీర్లను ఒక్కో షాపునకు 20 నుంచి 25 కేసులు కేటాయిస్తారు. ఇవి నిమిషాల వ్యవధిలోనే ఖాళీ అయిపోతున్నట్టు దుకాణదారులు చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజుకు దాదాపు 80 వేల కేసులకు పైగా బీర్లు అమ్ముడుపోతుండగా, ఇప్పుడు అదనంగా మరో 20 వేల కేసుల బీర్లకు డిమాండ్ ఉన్నట్టు వ్యాపారులు తెలిపారు.

  • Loading...

More Telugu News