Bournvita: బోర్నవిటాను ఆరోగ్య పానీయాల జాబితా నుంచి తొలగించండి: కేంద్రం

Union govt advisory to e commerce portals to remove Bournvita from health drinks category
  • పిల్లలకు శక్తినిచ్చే పానీయంగా బోర్నవిటా ఫేమస్
  • అయితే దీన్ని హెల్త్ డ్రింకుగా పరిగణించలేమన్న కేంద్రం
  • ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనల ప్రకారం హెల్త్ డ్రింకులేవీ లేవని స్పష్టీకరణ 
బోర్నవిటా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పిల్లలకు శక్తినిచ్చే పానీయంగా బోర్నవిటా ఎప్పటి నుంచో ప్రాచుర్యంలో ఉంది. బహుళజాతి కన్ఫెక్షనరీ సంస్థ క్యాడ్ బరీ బోర్నవిటాను ఉత్పత్తి చేస్తోంది. 

అయితే, భారత కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బోర్నవిటాను ఆరోగ్య పానీయాల జాబితా నుంచి తొలగించాలని అన్ని ఈ-కామర్స్ పోర్టళ్లకు కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సూచించింది. ఇది బోర్నవిటాకు మాత్రమే కాకుండా, ఈ కామర్స్ పోర్టళ్లలో హెల్త్ డ్రింకులుగా చలామణీలో ఉన్న అన్ని రకాల పానీయాలు, బేవరేజెస్ కు వర్తిస్తుందని స్పష్టం చేసింది. 

నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్సీపీసీఆర్) సెక్షన్ 14 ఆఫ్ సీఆర్పీసీ యాక్ట్ 2005 కింద జరిపిన విచారణలో ఆరోగ్య పానీయాలు అంటూ ఏవీ లేవని నిర్ధారించినట్టు కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ తన ప్రకటనలో వెల్లడించింది. 

కాగా, బోర్నవిటాలో నిర్దేశిత స్థాయి కంటే చక్కెర మోతాదు అధికంగా ఉన్నట్టు ఎన్సీపీసీఆర్ గుర్తించింది. బలవర్ధకమైన ఆరోగ్య పానీయాలు అంటూ ప్రచారం చేసుకుంటున్న వాణిజ్య ఉత్పత్తులపై చర్యలు తీసుకోవాలని ఎన్సీపీసీఆర్ గతంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ)ని కోరింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనల ప్రకారం బోర్నవిటా వంటి ఉత్పాదనలను హెల్త్ డ్రింకులుగా పేర్కొనలేమని స్పష్టం చేసింది.
Bournvita
Health Drink
E-Commerce
Union Govt
India

More Telugu News