Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాహుల్‌గాంధీ, కొండా సురేఖపై కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు

BRS Complaints Against Rahul Gandhi And Konda Surekha On Phone Tapping Case

  • ఆధారాలు లేకున్నా మాట్లాడారంటూ రాహుల్‌గాంధీపై ఫిర్యాదు
  • ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్
  • కొండా సురేఖపై ఈసీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎలాంటి సాక్ష్యాలు లేకున్నా కేసీఆర్ ప్రతిష్ఠకు భంగం కలిగేలా మాట్లాడి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, రాష్ట్రమంత్రి కొండా సురేఖపై కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. శనివారం నిర్వహించిన తుక్కుగూడ సభలో ఉద్దేశపూర్వకంగానే రాహుల్‌గాంధీ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ప్రస్తావించారని ఫిర్యాదులో పేర్కొంది. పోలీస్, ఇంటెలిజెన్స్ వర్గాలు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాయంటూ గత ప్రభుత్వంతో ముడిపెడుతూ ఆరోపించారని, ఇది పూర్తిగా అవాస్తవం, అక్రమమని పేర్కొంది. పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేయడం ద్వారా వేలాదిమంది ఫోన్లను ట్యాప్ చేసి ఆర్థిక ప్రయోజనాలు పొందారంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని, వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది.

ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉందని, పార్టీ అధినేత కేసీఆర్‌కు ఎలాంటి సంబంధమూ లేదని పేర్కొంది. విచారణ జరుగుతున్న అంశంపై మాట్లాడడం చట్ట వ్యతిరేకమని, రాహుల్ వ్యాఖ్యలు ఓటర్లను ప్రభావితం చేసేలా ఉన్నాయని పేర్కొంది. కాబట్టి వెంటనే విచారణ జరిపి ఎన్నికల ప్రచారంలో రాహుల్ పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని ఈసీని కోరింది. మరోవైపు, ఇదే అంశంపై ఇటీవల మాట్లాడిన మంత్రి కొండా సురేఖపైనా చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ నాయకులు కర్నె ప్రభాకర్, దాసోజు శ్రవణ్ పార్టీ తరపున ఈసీకి ఫిర్యాదు చేశారు.

Phone Tapping Case
Rahul Gandhi
Konda Surekha
BRS
  • Loading...

More Telugu News