RBI: ఆర్బీఐ వడ్డీ రేట్లు యథాతథం

RBI MPC Keep repo rate at 6 point 5 per cent for the 7th consecutive time

  • వరుసగా ఏడవ సారి రెపో రేటు 6.5 శాతంగా కొనసాగింపు
  • కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ
  • ద్రవ్యోల్బణం 9 నెలల కనిష్ఠానికి చేరిందన్న ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధి సాధించవచ్చునని అంచనా

ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్షా సమావేశం శుక్రవారం ముగిసింది. కీలకమైన రెపో రేటుని వరుసగా ఏడవసారి 6.5 శాతంగా కొనసాగిస్తూ ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) నిర్ణయించింది. ఈ మేరకు ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు అనుకూలంగా ఓటు వేశారని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. ద్రవ్యోల్బణం కట్టడి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. దీంతో ఎస్‌డీఎఫ్ (స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ) రేటు 6.25 శాతంగా, ఎంఎస్ఎఫ్ (మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ), బ్యాంక్ రేటులు 6.75 శాతంగా కొనసాగనున్నాయి.

ద్రవ్యోల్బణం 9 నెలల కనిష్ఠ స్థాయి 5.7 శాతానికి తగ్గిందని శక్తికాంత దాస్ వెల్లడించారు. ఆహార పదార్థాలు, ఇంధన ధరలు మినహా ఇతర ప్రధాన కేటగిరీలలో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిందని చెప్పారు. ద్రవ్యోల్బణం ఆర్బీఐ లక్ష్యానికి చేరువవుతోందని తెలిపారు. ప్రస్తుత ఏడాది రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతానికి తగ్గవచ్చునని అంచనా వేస్తున్నట్టు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దృఢమైన ఆర్థిక వృద్ధి అవకాశాలు ద్రవ్యోల్బణంపై ఆధారపడి ఉంటాయని, అందుకే ధరల తగ్గుదలపై దృష్టి కేంద్రీకరించామని చెప్పారు. ద్రవ్యోల్బణం విషయంలో ఆర్బీఐ అప్రమత్తంగా ఉందన్నారు.

ఈ ఏడాది వృద్ధి 7 శాతంగా అంచనా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో భారత్ 7 శాతం వృద్ధి సాధించే అవకాశాలున్నాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ అంచనా వేశారు. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 7.1 శాతం, జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 6.9 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఇక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం స్థిరంగా కనిపిస్తోందని, 2024లో ప్రపంచ వాణిజ్యం వేగంగా వృద్ధి చెందుతుందని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు.

RBI
Repo Rate
Shaktikanta Das
Business News
  • Loading...

More Telugu News