NASA: సూర్య గ్రహణం చీకట్లోకి నాసా రాకెట్లు.. ఎందుకు?

NASA is launching 3 rockets into the solar eclipse

  • సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో వాతావరణంలో మార్పులు
  • గ్రహణ సమయంలో కొన్ని నిమిషాల్లోనే వాటిని గుర్తించే వీలు
  • ఈ పరిశోధన కోసం రాకెట్లతో సైన్స్ పరికరాలను పంపుతున్న నాసా

ఏప్రిల్ 8వ తేదీ నాడు (మనకు 9వ తేదీన) సంభవిస్తున్న సంపూర్ణ సూర్య గ్రహణం చీకట్లోకి రాకెట్లను పంపించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సిద్దమైంది. గ్రహణ సమయంలో భూమి వాతావరణం పైపొరల్లో ఏర్పడే మార్పులను పరిశీలించడం కోసం ఈ రాకెట్లలో ప్రత్యేకమైన సైన్స్ ఉపకరణాలను పంపుతోంది.

సరిగ్గా గ్రహణ సమయంలో..
సూర్యుడికి భూమికి మధ్య చంద్రుడు సరిగ్గా అడ్డువచ్చి.. పూర్తి చీకటి ఏర్పడిన సమయంలో నాసా ఈ రాకెట్లను పంపనుంది. అందులో ఒకదానిని అమెరికా నుంచి, మిగతా రెండింటిని కెనడా, మెక్సికోల నుంచి ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేశారు.

అకస్మాత్తు మార్పుపై పరిశోధన..
సాధారణంగా భూమి తిరుగుతున్న కొద్దీ సూర్యుడి కిరణాలు కొద్దికొద్దిగా ప్రసరిస్తూ.. మధ్యాహ్నానికి తీవ్ర స్థాయికి చేరుతాయి. సాయంత్రానికి మెల్లగా ప్రసారం ఆగుతుంది. అలా కాకుండా.. తీక్షణంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా సూర్యరశ్మి ఆగిపోతే.. వాతావరణ పొరల్లో ఎలాంటి మార్పులు జరుగుతాయన్న అంశాలను నాసా శాస్త్రవేత్తలు పరిశోధించనున్నారు. 

ఎందుకీ పరిశోధన..
సూర్య కిరణాల్లోని రేడియేషన్ ను మన వాతావరణం అడ్డుకుంటూ ఉంటుంది. ఈ సమయంలో వాయువులు రేడియేషన్ కు గురై, వేడెక్కి.. వాటిలోని ఎలక్ట్రాన్లు విడివడతాయి. దీనితో వాతావరణం పైపొర విద్యుత్ ఆవేశితంగా మారుతుంది. భూమి అటువైపు తిరిగినప్పుడు ఆ ప్రాంతంలో సూర్య కిరణాలు నిలిచిపోయి వాతావరణం పైపొర తిరిగి సాధారణ స్థితికి వస్తుంది. అయితే ఇదంతా క్రమంగా సాగుతుంది కాబట్టి పరిశోధన చేయడం కాస్త కష్టతరం.
  • సూర్య గ్రహణం రోజున కొన్ని నిమిషాల వ్యవధిలోనే.. వాతావరణంలో రేడియేషన్ ప్రవేశం, ఇతర మార్పులు జరుగుతాయి. వీటిని పూర్తిస్థాయిలో గుర్తించేందుకు నాసా తాజా ప్రయోగం చేపట్టింది.
  • రాకెట్ల ద్వారా ప్రయోగించే సైన్స్ పరికరాలను ఇప్పటికే ఉపగ్రహాలతో అనుసంధానం చేసింది.
  • ప్రయోగ సమయంలో గుర్తించే అంశాలను ఈ పరికరాలు వెంటనే శాటిలైట్ల ద్వారా నాసాకు చేరవేస్తాయి.

  • Loading...

More Telugu News