Drugs: తమిళనాడులో పెద్దఎత్తున పట్టుబడుతున్న డ్రగ్స్.. వారం రోజులు తిరక్కుండానే రూ.71 కోట్ల విలువైన మాదకద్రవ్యాల పట్టివేత

Drugs worth Rs 71 crore bound for Sri Lanka seized in Tamil Nadu Village
  • శ్రీలంకకు తరలిస్తుండగా పట్టుకుని సీజ్ చేసిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ అధికారులు
  • పట్టుబడిన వాటిలో 70 కేజీల గంజాయి నూనె, 950 కేజీల గంజాయి
  • ఓ గ్రామంలోని రొయ్యల ఫాంపై దాడి చేసి పట్టుకున్న అధికారులు
  • గతవారం రూ. 108 కోట్ల విలువైన హాషిస్ ఆయిల్ పట్టివేత
తమిళనాడులో వారం రోజుల వ్యవధిలోనే మరోమారు పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. పుదుకొట్టై జిల్లాలోని ఓ గ్రామంలో రూ. 71 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను అధికారులు సీజ్ చేశారు. తొండి గ్రామం ద్వారా వీటిని శ్రీలంకకు తరలించేందుకు సిద్ధమవుతుండగా తిరుచురాపల్లికి చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ అధికారులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. మిమిసాల్ గ్రామంలోని ఓ రొయ్యల ఫాంలో వీటిని పట్టుకున్నారు.

పక్కా సమాచారంతో ఈ దాడి జరిగినట్టు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న వాటిలో 70 కేజీల గంజాయి నూనె, 950 కేజీల గంజాయి వున్నాయి. తొండి, ఎస్పీ పట్టణం, దేవీపట్టణం, మరైకాయర్ పట్టణం, వెధలై, తంగచిమడం, మండలం, పంబన్ నుంచి శ్రీలంకకు అక్రమంగా గంజాయి, సముద్రపు దోసకాయ, పసుపు, సముద్ర గుర్రాలు (సీహార్స్)లను అక్రమంగా తరలించబోతున్నట్టు సమాచారం అందుకున్న అధికారుల బృందం బోట్ల కదలికలపై నిఘాపెట్టింది. సముద్రపు దోసకాయ.. దీనినే సీ కుకుంబర్ అంటారు. ఇది ఒక సముద్ర జీవి. దోసకాయను పోలి ఉండడంతో దానిని అలా పిలుస్తారు.

గతరాత్రి అధికారుల బృందం ఎస్పీ పట్టణం నుంచి ఎన్నంకొట్టై వరకు ఉన్న రొయ్యల ఫాంలలో సోదాలు జరిపి డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది. అనంతరం వాటిని రామనాథపురం కస్టమ్స్ కార్యాలయానికి తరలించారు. డ్రగ్స్ బయటపడిన రొయ్యల ఫాం రామనాథపురానికి చెందిన సుల్తాన్ అనే వ్యక్తిదిగా అనుమానిస్తున్న పోలీసులు ఆయన కోసం వేట ప్రారంభించారు. కాగా, ఇటీవల తమిళనాడు నుంచి రూ. 108 కోట్ల విలువైన 99 కేజీల హాషిస్ ఆయిల్‌ను తరలిస్తుండగా నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారం కూడా కాకముందే మరోమారు పెద్దమొత్తంలో డ్రగ్స్ పట్టుబడడం కలకలం రేపుతోంది.
Drugs
Tamil Nadu
Sri Lanka
Ganja
Ganja Oil
Pudukkottai

More Telugu News