Michelle Obama: డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా మిషెల్ ఒబామాకు మొగ్గు!

Michelle Obama Top Contender To Replace Joe Biden As Presidential Candidate
  • బైడెన్ కు సరైన ప్రత్యామ్నాయం ఆమేనంటున్న నేతలు
  • పార్టీలో దాదాపు సగం మంది మద్దతు మిషెల్ కే.. అంతర్గత సర్వేలో వెల్లడి
  • అధ్యక్ష అభ్యర్థిని మార్చాలంటున్న 48 శాతం డెమోక్రాట్లు
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల హీట్ పెరుగుతోంది. రిపబ్లికన్లు, డెమోక్రాట్లలో వాడివేడి చర్చలు జరుగుతున్నాయి. రిపబ్లికన్ పార్టీలో ఇప్పటికే మొదలైన అభ్యర్థిత్వ రేసులో మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ దూసుకెళుతున్నాడు. క్రిమినల్ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నప్పటికీ అమెరికా భవిష్యత్తుకు తానే సరైన అధ్యక్షుడినని చెబుతున్నాడు. ఇక డెమోక్రాటిక్ పార్టీలో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి బరిలో నిలవనున్నట్లు తెలుస్తోంది. బైడెన్ కు పోటీగా అభ్యర్థిత్వం కోసం ఎవరూ ముందుకు రావడంలేదని సమాచారం. అయితే, వయసురీత్యా, జ్ఞాపకశక్తి దృష్ట్యా బైడెన్ అధ్యక్ష పదవికి అనర్హుడంటూ ఇటీవలి కాలంలో పలువురు నేతలు కామెంట్ చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బైడెన్ స్థానంలో మరో అభ్యర్థిని నిలబెట్టాలని డెమోక్రాటిక్ పార్టీ శ్రేణులు కూడా భావిస్తున్నాయి. ఇటీవల నిర్వహించిన అంతర్గత సర్వేలో ఈ విషయం బయటపడింది. బైడెన్ కు సరైన ప్రత్యామ్నాయం మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిషెల్ ఒబామా అయితే బాగుంటుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోందట. డెమోక్రాట్లలో దాదాపు సగం (48 శాతం) మంది మిషెల్ ఒబామా అభ్యర్థిత్వంవైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, తాను అధ్యక్ష పదవికి పోటీ పడాలన్న డిమాండ్లపై మిషెల్ ఒబామా గతంలోనే స్పందించారు. 

అధ్యక్ష ఎన్నికలు జరిగిన ప్రతిసారీ తను పోటీలో ఉండాలని కోరే వారి సంఖ్య పెరుగుతోందని మిషెల్ చెప్పారు. ఈ ఎన్నికల సమయంలోనూ మరోసారి ఈ డిమాండ్ తెరపైకి వస్తుందని కిందటి నెలలోనే ఆమె అనుమానించారు. ఈ ప్రభుత్వం అసలు ఏదైనా పనిచేస్తోందా అని చాలా మంది ప్రజలు భావిస్తుంటారని, తాను మాత్రం ప్రభుత్వమే అన్నీ చేయాలా అని అనుకుంటానని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని తేలిగ్గా తీసుకోకూడదని మిషెల్ హితవు పలికారు.
Michelle Obama
Presidential Race
America
USA
Joe Biden
Democrates

More Telugu News