Hanuma Vihari: టీమిండియా క్రికెటర్ హనుమ విహారి సంచలన ప్రకటన... ఆ రాజకీయ నేత ఎవరు?

Hanuma Vihari sensational revelations sparks debate

  • గత నెలలో ఆంధ్రా రంజీ టీమ్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న హనుమ విహారి
  • తాను తప్పుకోవడానికి గల కారణాలను నేడు వివరించిన విహారి
  • ఆంధ్రా జట్టులో ఓ రాజకీయ నేత కొడుకు ఉన్నాడని వెల్లడి 
  • అతడిపై తాను కోప్పడ్డానని, దాంతో అతడి తండ్రి క్రికెట్ సంఘంపై ఒత్తిడి తెచ్చాడని వివరణ
  • తనను కెప్టెన్సీ నుంచి తప్పుకోమన్నారంటూ నేటి ప్రకటనలో స్పష్టీకరణ

టీమిండియా క్రికెటర్, తెలుగుతేజం హనుమ విహారి గత నెలలో ఆంధ్రా రంజీ జట్టు కెప్టెన్సీ వదులుకున్న సంగతి తెలిసిందే. బ్యాటింగ్ పై దృష్టి సారించేందుకే విహారి సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. అసలు విషయం ఇప్పుడు వెల్లడైంది. తాను కెప్టెన్సీ వదులుకోవడానికి దారితీసిన పరిస్థితులను హనుమ విహారి ఓ ప్రకటనలో వివరించాడు. 

"కొన్ని వాస్తవాలను అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రకటన చేస్తున్నా. ఈ రంజీ సీజన్ లో ఆంధ్రా జట్టు బెంగాల్ టీమ్ తో ఆడినప్పుడు నేను కెప్టెన్ గా ఉన్నాను. ఆ సమయంలో ఆంధ్రా రంజీ టీమ్ లోని 17వ ఆటగాడిపై కోపంతో అరిచాను. దాంతో ఆ ఆటగాడు తన తండ్రికి ఫిర్యాదు చేశాడు. ఆ క్రికెటర్ తండ్రి ఒక రాజకీయనేత. నాపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన క్రికెట్ సంఘంపై ఒత్తిడి తీసుకువచ్చాడు. 

ఆ మ్యాచ్ లో బెంగాల్ పై 410 పరుగులు ఛేదించి నెగ్గాం. బెంగాల్ జట్టు చిన్నాచితకా జట్టేమీ కాదు... గతేడాది రంజీ ఫైనలిస్టు. అటువంటి జట్టుపై నెగ్గినప్పటికీ, కెప్టెన్ గా నన్ను రాజీనామా చేయాలని చెప్పారు. నా తప్పేమీ లేకపోయినా కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలన్నారు. ఆ ఆటగాడి గురించి నేను వ్యక్తిగతంగా మాట్లాడింది కూడా ఏమీ లేదు. కానీ నాకంటే ఆ ఆటగాడే ముఖ్యమని క్రికెట్ అసోషియేషన్ భావించింది. గతేడాది తన శరీరానికి తగిలిన దెబ్బను కూడా లెక్కచేయకుండా ఒక్కచేత్తో బ్యాటింగ్ చేసిన ఆటగాడి కంటే, గత ఏడేళ్లలో ఆంధ్రా జట్టును ఐదు సార్లు నాకౌట్ కు చేర్చిన ఆటగాడి కంటే క్రికెట్ సంఘానికి ఆ ఆటగాడే ముఖ్యం అయ్యాడు. 

నాకు ఈ పరిణామం ఎంతో వేదన కలిగించింది. అయినప్పటికీ ఈ సీజన్ లో ఆడుతున్నానంటే అందుకు కారణం...  క్రికెట్ పై నాకున్న గౌరవం, నా జట్టుపై నాకున్న గౌరవం. తాము ఏం చెబితే క్రికెటర్లు అది వినాలని, తమ వల్లే క్రికెటర్లు జట్టుకు ఎంపికై ఆడుతున్నారని క్రికెట్ అసోసియేషన్ భావిస్తుండడం విచారకరం. ఈ ఘటనపై నాలో నేనే బాధపడ్డాను కానీ ఇప్పటిదాకా బయటికి చెప్పుకోలేదు. అందుకే... ఇక ఎప్పటికీ ఆంధ్రా టీమ్ కు ఆడరాదని నిర్ణయించుకున్నాను. నాకు గౌరవం లేని చోట నేను ఉండలేను. ఆ జట్టు అంటే నాకు ఇష్టమే... ప్రతి సీజన్ కు మేం ఎంతో  మెరుగవుతూ వస్తున్నాం... కానీ మేం ఎదగడమే క్రికెట్ అసోసియేషన్ కు ఇష్టం లేనట్టుంది" అంటూ హనుమ విహారి తన ప్రకటనలో వివరించాడు. 

గత సీజన్ లో హనుమ విహారి రంజీ క్వార్టర్ ఫైనల్లో ఆడుతూ మణికట్టు గాయానికి గురయ్యాడు. అయితే జట్టు కోసం ఒక్క చేత్తోనే బ్యాటింగ్ చేసి తన పోరాట పటిమను చాటుకున్నాడు. తాను రైట్ హ్యాండ్ బ్యాటర్ అయినప్పటికీ, గాయం వల్ల లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేశాడు. నాడు కెప్టెన్ గా హనుమ విహారి ప్రదర్శించిన స్ఫూర్తి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

Hanuma Vihari
Andhra Ranji Team
Andhra Cricket Association
Captaincy
Team India
  • Loading...

More Telugu News