Nagababu: తెల్లారితే గ్లాస్ తోనే తేనేటి విందు: నాగబాబు

  • సింక్ లో ఉన్నా సరే మరుసటి రోజుకు మళ్లీ వస్తుందని వ్యాఖ్య
  • రెక్కలు విరిగిన ఫ్యాన్ తో ఏ ఊపయోగమూ ఉండదని ఎద్దేవా
  • జగన్ కు నాగబాబు ఇచ్చిపడేశాడుగా.. అంటూ జనసైనికుల కామెంట్లు
Janasena Leader Nagababu Reaction On CM Jagan Comments About Glass

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై జనసేన నేత, సినీ నిర్మాత నాగబాబు సెటైర్ వేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడులో ఆదివారం జరిగిన సిద్ధం సభలో జగన్ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ఈ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. సైకిల్ ఇంటి బయట ఉండాలి, తాగేసిన టీ గ్లాసు సింక్ లోనే ఉండాలి, కానీ ఇంట్లో ఎప్పుడూ ఫ్యాన్ తిరుగుతూనే ఉండాలని అన్నారు. టీడీపీ, జనసేన ఎన్నికల చిహ్నాలపై సెటైరికల్ గా జగన్ వేసిన పంచ్ లకు జనం జేజేలు కొట్టారు. జగన్ సెటైర్ పై సోమవారం జనసేన నేత నాగబాబు స్పందించారు.

‘గ్లాస్ సింక్ లో ఉన్నా కూడా తెల్లారితే మళ్లీ తేనేటి విందు ఇస్తుంది.. కానీ, ఫ్యాన్ రెక్కలు విరిగితే విసనకర్ర ఇచ్చినంత గాలి కూడా ఇవ్వదు’ అంటూ జగన్ కు నాగబాబు కౌంటర్ ఇచ్చారు. అయినా సారూ.. మీరు పబ్లిక్ మీటింగ్స్ లలో ప్రాసలు, పంచుల మీద పెట్టిన శ్రద్ధలో సగం ‘ప్రజాపరిపాలన’ మీద పెట్టుంటే బాగుండేదంటూ సీఎం జగన్ కు హితవు పలికారు. చివరగా అయామ్ టెల్లింగ్ దట్.. అంటూ కింగ్ సినిమాలో బ్రహ్మానందం డైలాగ్ తో నాగబాబు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జగన్ కు ఇచ్చిపడేశారంటూ జన సైనికులు కామెంట్లు పెడుతున్నారు.

More Telugu News