Church Shooting: అమెరికా చర్చిలో కాల్పుల కలకలం.. పోలీసుల కాల్పుల్లో నిందితురాలి మృతి

Suspect killed in shooting incident at Lakewood Church In Houston

  • హూస్టన్ మెగా చర్చికి తుపాకీతో వచ్చిన మహిళ
  • ప్రార్థనలు జరుగుతుండగా కాల్పులు
  • వెంట వచ్చిన ఐదేళ్ల బాలుడికి బుల్లెట్ గాయాలు

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ప్రార్థనల కోసం వేల మంది హాజరయ్యే చర్చిలో ఓ మహిళ తుపాకీతో కాల్పులు జరిపింది. దీంతో ప్రార్థనలు చేస్తున్న జనమంతా భయాందోళనలతో పరుగులు తీశారు. ఓ వృద్ధుడికి బుల్లెట్ గాయమైంది. చర్చిలో ఉన్న భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరపడంతో నిందితురాలు అక్కడికక్కడే చనిపోయింది. ఆమె వెంట వచ్చిన ఐదేళ్ల బాలుడికీ బుల్లెట్ గాయాలయ్యాయి. హూస్టన్ లోని మెగా చర్చిలో ఆదివారం ప్రార్థనల సమయంలో ఈ దారుణం జరిగింది.

హూస్టన్ లోని లేక్ వుడ్ మెగా చర్చిలో ఆదివారం మధ్యాహ్నం ప్రార్థనలు జరుగుతుండగా ఓ 30 ఏళ్ల వయసున్న మహిళ పొడవాటి కోటుతో వచ్చింది. ఐదేళ్ల బాలుడితో పాటు వచ్చిన ఆ మహిళ.. తన కోటు వెనకాల తుపాకీని దాచి తెచ్చింది. లోపల అడుగుపెట్టిన కాసేపటికే తుపాకీ తీసి విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. పెద్దగా కేకలు వేస్తూ తన దగ్గర బాంబు ఉందని, దానిని పేల్చేస్తానని బెదిరించింది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు.

ఎదురు కాల్పులు జరిపి నిందితురాలిని మట్టుబెట్టారు. నిందితురాలు జరిపిన కాల్పుల్లో ఓ వృద్ధుడు గాయపడ్డాడు. నిందితురాలి వెంట వచ్చిన బాలుడికి కూడా బుల్లెట్ గాయాలయ్యాయని, ప్రస్తుతం బాలుడి పరిస్థితి సీరియస్ గా ఉందని పోలీసులు తెలిపారు. కాగా, నిందితురాలు ఎవరు, ఎందుకు కాల్పులు జరిపింది, ఆమె వెంట వచ్చిన బాలుడు ఎవరనే వివరాలు ఇంకా తెలియరాలేదని, విచారణ జరుపుతున్నామని హూస్టన్ పోలీస్ చీఫ్ మీడియాకు వెల్లడించారు.

  • Loading...

More Telugu News