Students Suicide: భువనగిరి ఎస్సీ హాస్టల్ లో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య

Two Students commits suicide In Bhuvangiri SC Girls Hostel
  • ఒకే గదిలో రెండు ఫ్యాన్లకు ఉరేసుకున్న బాలికలు
  • ఏ తప్పు చేయకున్నా మమ్మల్ని నిందిస్తున్నారంటూ సూసైడ్ నోట్
  • విద్యార్థినుల మృతదేహాలతో తల్లిదండ్రుల ఆందోళన
‘ఏ తప్పూ చేయకున్నా అందరూ మమ్మల్ని మాటలంటుంటే తట్టుకోలేకపోతున్నాం.. మా బాధ ఎవరికీ చెప్పుకోలేక పోయాం. మా శైలజ మేడం తప్ప ఎవరూ మమ్మల్ని నమ్మలేదు. అందుకే వెళ్లిపోతున్నాం. మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని ఒకేచోట సమాధి చేయండి’ అంటూ లేఖ రాసి పదో తరగతి విద్యార్థినులు ఇద్దరు హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ఎస్సీ గర్ల్స్ హాస్టల్ లో శనివారం రాత్రి చోటుచేసుకుందీ విషాదం.

హైదరాబాద్‌లోని హబ్సిగూడకు చెందిన బాలికలు (భవ్య, వైష్ణవి) హాస్టల్ లో ఉంటూ రెడ్డివాడ గర్ల్స్ హైస్కూల్ లో పదోతరగతి చదువుతున్నారు. శనివారం స్కూలుకు వెళ్లిన విద్యార్థినులు సాయంత్రం హాస్టల్ కు తిరిగి వచ్చారు. హాస్టల్ లోనే నిర్వహిస్తున్న ట్యూషన్ కు వెళ్లకుండా రూమ్ లోనే ఉండిపోయారు. రాత్రి భోజనం చేశాక వస్తామంటూ ట్యూషన్ టీచర్ కు చెప్పారు. అయితే, భోజనం చేయడానికీ వారు రాకపోవడంతో ఓ విద్యార్థిని వెళ్లి చూడగా.. గదిలోని రెండు ఫ్యాన్లకు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించారు. వెంటనే విద్యార్థినులు, టీచర్ వారిని కిందికి దించి అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. అయితే, విద్యార్థినులు ఇద్దరూ అప్పటికే చనిపోయారని వైద్యులు వెల్లడించారు.

సూసైడ్ లెటర్ లో..
విద్యార్థినుల గదిలో సూసైడ్ లెటర్ ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అందులో తాము ఏ తప్పూ చేయలేదని, అయినా తమను ఎవరూ నమ్మడంలేదని బాలికలు ఆరోపించారు. అందరూ అనే మాటలు తట్టుకోలేక చనిపోతున్నట్లు పేర్కొన్నారు. తమ మృతదేహాలను ఒకేచోట సమాధి చేయాలని లేఖలో కోరారు. కాగా, విద్యార్థినుల మృతిపై పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. హాస్టల్ వార్డెన్ శైలజ, ట్యూషన్ టీచర్ లను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

గొడవే కారణమా..
హాస్టల్ లో విద్యార్థినుల మధ్య జరిగిన గొడవ వల్లే ఇద్దరు బాలికలు ఆత్మహత్య చేసుకుని ఉంటారని డీఈవో చెప్పారు. ఈ విద్యార్థినులు ఇద్దరూ తమను దూషించడంతో పాటు చేయి చేసుకున్నారంటూ మరో నలుగురు విద్యార్థినులు స్కూలులో టీచర్ కు ఫిర్యాదు చేశారని తెలిసింది. ఈ ఫిర్యాదుతో పాటు టీచర్ కౌన్సిలింగ్ తో అవమానంగా భావించి విద్యార్థినులు ఇద్దరూ బలవన్మరణానికి పాల్పడి ఉంటారని వివరించారు.

ఆ లేఖలో రాత మా పిల్లలది కాదు..
మృతదేహాల వద్ద దొరికిన లేఖ తమ పిల్లలు రాసింది కాదని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థినుల మృతదేహాలతో వారు ఆందోళనకు దిగారు. తమ పిల్లలను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ బంధువులతో కలిసి ఆదివారం హాస్టల్ ముందు ఆందోళనకు దిగారు. దీంతో భువనగిరి ఎస్సీ హాస్టల్ ముందు ఉద్రిక్తత నెలకొంది.
Students Suicide
SC Girls Hostel
Bhuvangiri
Two Students
Yadadri Bhuvanagiri District
Crime News

More Telugu News