YS Sharmila: మాట నిలబెట్టుకోని మీరు కేడీ కాక మోడీ అవుతారా?: షర్మిల

Sharmila questions PM Modi on Special Status and Polavaram
  • నేడు తిరుపతి, చిత్తూరు జిల్లాల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం
  • తిరుపతిలో సమావేశం... హాజరైన షర్మిల
  • తిరుపతిలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని మోదీని నిలదీసిన వైనం
  • బాబు, జగన్ కూడా కేడీలేనని విమర్శలు
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నేడు తిరుపతి, చిత్తూరు జిల్లాల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. తిరుపతిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇచ్చిన మాటను ఒక్కటి కూడా మోదీ నిలబెట్టుకోలేకపోయారని షర్మిల విమర్శించారు. 

పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదాతో 90 శాతం నిధులు తామే ఇస్తామని మోదీ ప్రకటించారని, ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. మా పోలవరం ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు అంటే, మరి మీరు కేడీ కాక మోడీ అవుతారా? అని రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

"పదేళ్లయినా మాకు ఇంతవరకు రాజధాని లేదు. చంద్రబాబేమో అమరావతి రాజధాని అని, సింగపూర్ చేస్తానని త్రీడీ, సినిమా గ్రాఫిక్స్ చూపించారు. జగనన్న గారేమో మాకు ఒకటి సరిపోదు... మూడు కావాలి అని మొత్తం గందరగోళం చేశారు. ఆఖరికి మాకు ఒక్క రాజధాని కూడా లేదు. రాష్ట్రంలో ఏ నగరంలోనూ ఒక్క మెట్రో కూడా లేదు. దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా మెట్రో లేదంటే అది ఒక్క ఏపీలోనే. మేం అంత  తీసిపోయామా?

మాకు ప్రత్యేక హోదా లేదు, పోలవరం లేదు, రాజధాని లేదు, మా బిడ్డలకు ఉద్యోగాలు లేవు, మా రైతులకు భరోసా లేదు. మరి మాకు ఏం మిగిల్చారు. మీరు సమస్తం దోచుకుంటే మరి మీరు కేడీ కాక మోడీ ఎలా అవుతారు?" అంటూ  షర్మిల ధ్వజమెత్తారు.

ఇదే తిరుపతి నగరంలో నిలబడి మోడీ గారు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ఏమైంది మోడీ గారూ అని అడుగుతున్నాం. మాట నిలబెట్టుకోని మీరు మోడీ అవుతారా? కేడీ అవుతారా? అని నిలదీశారు. 

"మాట నిలబెట్టుకోని మీరు కేడీనే అవుతారు... ఏపీ ప్రజలకు మోడీ చేసింది పాపం, అన్యాయం... బీజేపీ కేడీల పార్టీ. ఆ కేడీ పార్టీకి మద్దతు తెలిపిన బాబు, జగనన్న కూడా కేడీలే అవుతారు" అంటూ షర్మిల వ్యాఖ్యానించారు.
YS Sharmila
Narendra Modi
Tirupati
AP Special Status
Polavaram Project
Congress
Andhra Pradesh

More Telugu News