Rahul Gandhi: అసోంలో రాహుల్ గాంధీపై కేసు నమోదు

Assam Police files case on Rahul Gandhi and other Congress leaders

  • అసోంలో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర
  • రాహుల్ యాత్ర నక్సల్ పంథాలో సాగుతోందన్న అసోం సీఎం
  • ప్రజలను రెచ్చగొడుతున్నాడంటూ ఆరోపణలు
  • వివిధ సెక్షన్ల కింద రాహుల్, కేసీ వేణుగోపాల్, కన్హయ్య కుమార్ లపై కేసు

భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా ఇటీవల అసోంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేసు నమోదైంది. ప్రజా ఆస్తులకు నష్టం కలిగించడం, ప్రజలను రెచ్చగొట్టడం, పోలీసులపై దాడి వంటి అభియోగాలతో రాహుల్ గాంధీపై అసోంలో కేసు నమోదు చేశారు. 

రాహుల్ గాంధీపై 120 (బి), 143/147/188/283/353/332/333/427, ఐపీసీ ఆర్/డబ్ల్యూ, పీడీపీపీ యాక్ట్ సెక్షన్ 3 కింద కేసు నమోదు చేసినట్టు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. రాహుల్ తో పాటు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ యువనేత కన్హయ్య కుమార్ లపైనా అసోం ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. 

అసోంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా సీఎం హిమంత బిశ్వ శర్మ, రాహుల్ గాంధీ మధ్య వాడీవేడి మాటల యుద్ధం జరిగింది. రాహుల్ గాంధీ రాష్ట్ర ప్రజలను రెచ్చగొడుతున్నాడని, అతడి యాత్ర నక్సల్ పంథాలో సాగుతోందని బిశ్వ శర్మ తీవ్ర విమర్శలు చేశారు. ఇది అసోంకు ఏమంత క్షేమకరం కాదని అన్నారు. 

అందుకు రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు. తానంటే బిశ్వ శర్మకు ఎందుకంత భయం అని ప్రశ్నించారు. తనను ఎవరూ బెదిరించలేరని స్పష్టం చేశారు. అసోం సీఎం దేశంలోనే అత్యంత అవినీతిపరులైన ముఖ్యమంత్రుల్లో ఒకరన్న విషయం అందరికీ తెలుసని అన్నారు. తన యాత్రకు బీజేపీ ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తోందని రాహుల్ గాంధీ మండిపడ్డారు. 

ఈ క్రమంలోనే రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలంటూ అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ రాష్ట్ర డీజీపీకి ఆదేశాలు ఇచ్చారు.

Rahul Gandhi
Police Case
Assam
Bharat Jodo Nyay Yatra
Congress
India
  • Loading...

More Telugu News