YS Sharmila: ఇదేం న్యాయం... అయోధ్యలో కార్యక్రమం జరుగుతుంటే అసోంలో రాహుల్ గాంధీ గుడికి వెళ్లకూడదా?: షర్మిల 

Sharmila staged dharna after Rahul Gandhi has been denied to enter a temple in Assam

  • అసోంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర
  • రాహుల్ గాంధీకి ఆలయ ప్రవేశం నిరాకరణ
  • రోడ్డుపై బైఠాయించిన రాహుల్
  • రాహుల్ కు మద్దతుగా ఏపీ కాంగ్రెస్ నేతల ధర్నా
  • రాహుల్ కు బీజేపీ, అసోం సీఎం క్షమాపణలు చెప్పాలన్న షర్మిల

అసోంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీని ఓ ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడం పట్ల కాంగ్రెస్ వర్గాలు భగ్గుమంటున్నాయి. బోర్డువాలోని శ్రీ శ్రీ శంకర్ దేవ్ సత్రా ఆలయాన్ని ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి సందర్శించాలని రాహుల్ గాంధీ భావించారు. 

అయితే రాహుల్ ను అధికారులు హయబోరాగావ్ అనే గ్రామం వద్ద నిలువరించారు. ఆయనను ముందుకు వెళ్లనివ్వకుండా ఆపేశారు. రాహుల్ ను స్థానిక బీజేపీ నాయకత్వం అడ్డుకుందంటూ కాంగ్రెస్ మహిళా నేతలు అక్కడికక్కడే ధర్నా చేపట్టారు. రాహుల్ కూడా రోడ్డుపై బైఠాయించారు. ఈ పరిణామాలపై ఏపీ కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో ఆ పార్టీ  నేతలు విశాఖలో జీవీఎంసీ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. 

ఈ సందర్భంగా షర్మిల బీజేపీ నాయకత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎక్కడో అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్ఠాపన జరుగుతుంటే, ఇక్కడ రాహుల్ గాంధీని ఆలయంలోకి వెళ్లనివ్వకుండా అడ్డుకుంటారా?... ఇదేం న్యాయం? అని మండిపడ్డారు. 

రాహుల్ గాంధీ గుడికి వెళ్లాంటే మోదీ అనుమతి కావాలా? బీజేపీ అనుమతి తీసుకోవాలా? అని ప్రశ్నించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్ పీ వాళ్లు మాత్రమే గుడికి వెళ్లాలా... సామాన్యులకు గుడికి వెళ్లే హక్కు లేదా? అని షర్మిల ప్రశ్నించారు. ఆలయంలోకి రాహుల్ గాంధీకి ఎందుకు అనుమతి నిరాకరించారో ప్రధాని మోదీ, అసోం ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

ఇలా అడుగడుగునా నిరంకుశ పాలన సాగిస్తున్నారు... ఇంత నీచమైన పరిపాలన చేస్తుంటే దీన్ని ప్రజాస్వామ్యం అని ఎలా పిలుస్తారని షర్మిల విమర్శించారు. ఎన్నికల దగ్గరపడుత్ను సమయంలో ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, బీజేపీ ప్రభుత్వ నిరంకుశ పోకడలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. 

ఇలాంటివి ప్రజాస్వామ్యంలో ఎవరూ సహించరని... బీజేపీతో పాటు అసోం ముఖ్యమంత్రి కూడా రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.

YS Sharmila
Rahul Gandhi
Temple
Congress
BJP
Ayodhya Ram Mandir
Assam
Bharat Jodo Nyay Yatra
  • Loading...

More Telugu News