Hand Transplant: దేశంలోనే తొలిసారి.. కిడ్నీ మార్పిడి చేయించుకున్న వ్యక్తికి చేయి మార్పిడి!

Faridabad hospital conducts Indias first successful hand transplantation

  • 65 ఏళ్ల వృద్ధుడికి ఒక చేయి.. 19 ఏళ్ల  కుర్రాడికి రెండు చేతులు అమర్చిన వైద్యులు
  • ఇద్దరికీ ఒకేసారి ఆపరేషన్
  • 17 గంటలపాటు కొనసాగిన శస్త్ర చికిత్స
  • విజయం సాధించిన ఫరీదాబాద్‌లోని అమృత ఆసుపత్రి

కిడ్నీ మార్పిడి, కీలుమార్పిడి, గుండె మార్పిడి వంటి శస్త్రచికిత్సల గురించి విన్నాం. కానీ, హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్‌‌లోని అమృత ఆసుపత్రి ఇద్దరు వ్యక్తులకు ఏకంగా చేయి మార్పడి ఆపరేషన్ చేసి విజయం సాధించింది. ఇలాంటి ఆపరేషన్ దేశంలో ఇదే మొదటిది. 

పదేళ్ల క్రితం కిడ్నీ మార్పిడి చేయించుకున్న 65 ఏళ్ల గౌతం తయాల్ తాజాగా చేయి మార్పిడి ఆపరేషన్ చేయించుకుని ప్రపంచంలోనే రెండో వ్యక్తిగా, దేశంలోని మొదటి వ్యక్తిగా రికార్డులకెక్కారు. చేయి మార్పిడి చేయించుకున్న మరో కుర్రాడి వయసు 19 ఏళ్లు. ఈ రెండు క్లిష్టతరమైన ఆపరేషన్లు డిసెంబరు చివరి వారంలో జరిగాయి. దాదాపు 17 గంటలపాటు జరిగిన ఆపరేషన్లు విజయవంతమైనట్టు వైద్యులు తెలిపారు. 

ఢిల్లీకి చెందిన గౌతం తయాల్‌కు దశాబ్దం క్రితం కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ జరిగింది. రెండేళ్ల క్రితం ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో మణికట్టు పైనుంచి చేయిని కోల్పోవాల్సి వచ్చింది. తాజాగా, ఆయనకు బ్రెయిన్ డెడ్ అయిన థానేకు చెందిన 40 ఏళ్ల వ్యక్తి చేయిని అమర్చారు. గౌతం కోలుకుంటున్నారని, మరో వారంలో ఆయనను డిశ్చార్జ్ చేస్తామని ఆసుపత్రిలోని సెంటర్ ఫర్ ప్లాస్టిక్ అండ్ రికన్‌స్ట్రక్టివ్ సర్జరీ వైద్యుడు డాక్టర్ మోహిత్ శర్మ తెలిపారు.  

హ్యాండ్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్న మరో వ్యక్తి వయసు 19 సంవత్సరాలు. పేరు దేవాన్ష్ గుప్తా. అతడిది కూడా ఢిల్లీయేనని వైద్యులు తెలిపారు. మూడేళ్ల క్రితం జరిగిన రైలు ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయాడు. కుడి మోకాలి కిందభాగం కూడా కోల్పోయాడు. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ బ్రెయిన్ డెడ్ అయిన సూరత్‌కు చెందిన 33 సంవత్సరాల వ్యక్తి రెండు చేతులు దేవాన్ష్‌కు అమర్చారు. ఈ శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు పలు సవాళ్లు ఎదురైనట్టు డాక్టర్ అనిల్ మురార్క తెలిపారు. 

రోగులు ఇద్దరూ కోలుకుంటున్నారని, ఈ ఆపరేషన్ తర్వాత ఇద్దరి జీవితాలకు రెండో అవకాశం లభించిందని వైద్యులు పేర్కొన్నారు. మున్ముందు వారిద్దరూ ఎప్పటిలానే జీవిస్తారని పేర్కొన్నారు.

Hand Transplant
Faridabad
Haryana
Amrita Hospital
  • Loading...

More Telugu News