MS Dhoni: ఎంఎస్ ధోనీపై పరువునష్టం కేసు నమోదు.. రేపు విచారణ

A defamation case has been registered against MS Dhoni and The hearing will be held tomorrow in the High Court

  • ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసిన ధోనీ మాజీ వ్యాపార భాగస్వాములు మిహిర్ దివాకర్ దంపతులు
  • ఒప్పంద ఉల్లంఘన జరిగిందంటూ ధోనీ అసత్య ఆరోపణలు చేసి పరువుకు భంగం కలిగించారని పిటిషన్
  • సోషల్ మీడియా, మీడియాలో అసత్య ప్రచారాలను నియంత్రించాలని కోర్టుకు అభ్యర్థన

టీమిండియా మాజీ దిగ్గజం ఎంఎస్ ధోనీపై ఢిల్లీలో పరువునష్టం కేసు నమోదయింది. ధోనీ మాజీ వ్యాపార భాగస్వాములు, ఆర్కా స్పోర్ట్స్ డైరెక్టర్లు మిహిర్ దివాకర్, అతడి భార్య సౌమ్య దాస్ ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఒప్పంద ఉల్లంఘన జరిగిందంటూ అసత్య ఆరోపణలు, హానికరమైన ప్రకటనలు చేసి ధోనీ తమ పరువుకు భంగం కలిగించారని, నష్టపరిహారం చెల్లించాలని పిటిషనర్లు కోరారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, అనేక మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై తమకు వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటనలు చేయకుండా నియంత్రించాలని కోర్టును అభ్యర్థించారు.

2017 ఒప్పందాన్ని ఉల్లంఘించి తనకు చెల్లించాల్సిన రూ. 16 కోట్లు ఎగ్గొట్టారని ధోనీ చేసిన ఆరోపణలు తమ ప్రతిష్ఠను దెబ్బ తీస్తున్నాయని దివాకర్, దాస్ పిటిషన్‌లో  పేర్కొన్నారు. ఈ కేసుపై జనవరి 18న (గురువారం) ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. కాగా దివాకర్, అతడి భార్య దాస్ తనను రూ.16 కోట్లకు మోసం చేశారంటూ ఎంఎస్ ధోనీ ఇటీవలే క్రిమినల్ కేసు పెట్టారు. క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేస్తామని ఒప్పందాన్ని కుదుర్చుకొని దానిని పాటించలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో ఐపీసీ 406, 420 సెక్షన్ల కింద రాంచీ కోర్టులో కేసు నమోదయింది.

  • Loading...

More Telugu News