Finance Rules: కొత్త ఏడాదిలో కొత్త రూల్స్.. అమలులోకి వచ్చిన మార్పులు ఇవే!

Finance Related Rules Which Came Into Effect From Today Onwards

  • పొదుపు పథకాల వడ్డీని స్వల్పంగా పెంచిన కేంద్రం
  • నేటి నుంచి 2 నుంచి 3 శాతం పెరిగిన కార్ల ధరలు
  • సిమ్ కార్డుల జారీకి ఇకపై డిజిటల్ వెరిఫికేషన్

2023 కు బై బై చెప్పి 2024 లోకి అడుగుపెట్టేశాం.. కొత్త ఏడాదిలో క్యాలెండర్ తో పాటు పలు నియమనిబంధనలు కూడా మారాయి. ఆర్థికపరంగా కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. పొదుపు పథకాల నుంచి వాహనాల ధరల దాకా, హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి సిమ్ కార్డుల కొనుగోలు దాకా పలు మార్పులు చోటుచేసుకున్నాయి. నేటి నుంచి అమలులోకి వచ్చిన ఈ కొత్త రూల్స్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..

పొదుపు పథకాల వడ్డీ పెంపు..
ఆర్థికపరమైన మార్పుల విషయానికి వస్తే పొదుపు పథకాలకు చెల్లించే వడ్డీ రేట్లను కేంద్రం పెంచింది. జనవరి - మార్చి త్రైమాసికానికి సంబంధించి వడ్డీ రేటు పెరిగింది. ప్రస్తుతం 8 శాతం వడ్డీ చెల్లిస్తున్న సుకన్య సమృద్ధి పథకానికి 20 బేసిస్ పాయింట్లను పెంచింది. అంటే, వచ్చే మూడు నెలల పాటు ఈ పథకం లబ్దిదారులకు 8.2 శాతం వడ్డీ చెల్లిస్తుందన్నమాట. మూడేళ్ల టైమ్‌ డిపాజిట్‌పై 7 శాతంగా ఉన్న వడ్డీ రేటును 7.1 శాతానికి పెంచింది.

పెరగనున్న కార్ల ధరలు..
జనవరి నుంచి తమ వాహనాల ధరలు పెంచుతున్నట్లు టాటా మోటార్స్‌, ఆడి, మారుతీ సుజుకీ, మెర్సిడెస్‌ బెంజ్‌ కంపెనీలు గతంలోనే ప్రకటించాయి. ముడి సరుకుల ధరలు పెరగడంతో ఉత్పత్తి వ్యయం పెరిగిందని, దీంతో వాహనాల ధరలను 2 శాతం నుంచి 3 శాతం పెంచక తప్పడంలేదని తెలిపాయి.

నిలిచిపోనున్న యూపీఐ ఖాతాలు
ఏడాదికి పైగా ఉపయోగించని యూపీఐ ఖాతాలు నేటి నుంచి డీయాక్టివేట్ అవుతాయి. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం తదితర యూపీఐలలో నిరుపయోగంగా ఉన్న ఖాతాలను తొలగించనున్నట్లు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా గతేడాది నవంబర్ 7 న ప్రకటించింది.

హెల్త్ ఇన్సూరెన్స్ రూల్స్..
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలకు సంబంధించిన ప్రాథమిక సమాచారం ఇకపై సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఇందుకోసం బీమా కంపెనీలు ‘కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్ (సీఐఎస్)’ లను విడుదల చేయనున్నాయి. ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అథారిటీ (ఐఆర్డీఏ) ఆదేశాల మేరకు కంపెనీలు ఈ చర్యలు చేపట్టాయి. 

కొత్త సిమ్ కార్డుకు కొత్త రూల్..
సిమ్‌ కార్డుల జారీకి డిజిటల్ వెరిఫికేషన్ విధానం అమలులోకి వచ్చింది. టెలికాం కంపెనీలు పూర్తిగా మొబైల్ ద్వారానే వెరిఫికేషన్ చేస్తాయి. సిమ్‌ కార్డుల ద్వారా జరిగే మోసాలను అరికట్టేందుకు కేంద్రం ఈ విధానాన్ని తీసుకొచ్చింది. ఇప్పటి వరకు అనుసరించిన పేపర్‌ ఆధారిత కేవైసీ వెరిఫికేషన్‌ విధానానికి స్వస్తి పలికింది.

  • Loading...

More Telugu News