ULFA: అసోంలో కేంద్రం, 'ఉల్ఫా' మిలిటెంట్ సంస్థ మధ్య చారిత్రాత్మక ఒప్పందం

Historical pact between Union govt and ULFA in Assam

  • అసోంలో దశాబ్దాల హింసకు తెర
  • అసోంలో శాంతి స్థాపన దిశగా కీలక ముందడుగు
  • హింసను విడనాడి, తమ సంస్థను రద్దు చేస్తామని ప్రకటించిన ఉల్ఫా
  • ఉల్ఫా ప్రజాస్వామ్య ప్రక్రియలోకి తిరిగిరావడం గొప్ప విషయమన్న అమిత్ షా

ఈశాన్య రాష్ట్రం అసోంలో దశాబ్దాలుగా నెలకొన్న హింసకు చరమగీతం పాడేందుకు ఉల్ఫా మిలిటెంట్ సంస్థ ముందుకొచ్చింది. అసోంలో కేంద్రం, ఉల్ఫా మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరింది. దాంతో అసోంలో శాంతిస్థాపన దిశగా కీలక ముందడుగు పడింది. 

కేంద్రం, అసోం ప్రభుత్వం మధ్య జరిగిన చర్చల్లో సానుకూల నిర్ణయాలు తీసుకున్నారు. శాంతి ఒప్పందంపై ఉల్ఫా అనుకూల వర్గం సంతకం చేసింది. హింసను విడనాడతామని, తమ సంస్థను రద్దు చేస్తామని ఉల్ఫా పేర్కొంది. ఆ మేరకు అంగీకారం తెలిపింది. ప్రజాస్వామ్య ప్రక్రియలో తిరిగి చేరతామని ఉల్ఫా ప్రకటించింది. 

ఈ పరిణామంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఉల్ఫా హింస వల్ల అసోం చాలా నష్టపోయిందని అన్నారు. ఉల్ఫా ప్రజాస్వామ్య ప్రక్రియలో చేరడం గొప్ప విషయమని అభివర్ణించారు. ఈ క్రమంలో అసోంకు భారీ అభివృద్ధి ప్యాకేజీ ఇస్తున్నామని అమిత్ షా ప్రకటించారు. 

యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం (యూఎల్ఎఫ్ఏ)కు సంక్షిప్త రూపమే ఉల్ఫా. ఇది ఒక సాయుధ వేర్పాటు వాద సంస్థ. స్థానిక అస్సామీ ప్రజల కోసం ప్రత్యేక దేశంగా అసోంను ఏర్పాటు చేయడమే ఉల్ఫా లక్ష్యం. ఇది 1979లో పురుడు పోసుకుంది. 

అయితే, ఉల్ఫాను భారత కేంద్ర ప్రభుత్వం 1990లో ఉగ్రవాద  సంస్థగా ప్రకటించి నిషేధం విధించింది. అనేక దశాబ్దాలుగా అసోంలో ఉల్ఫాకు, సైన్యానికి మధ్య హింస చోటుచేసుకుంది. ఈ దాడుల్లో 10 వేల మంది వరకు అస్సామీ యువకులు మరణించినట్టు అంచనా. 

గెరిల్లా పోరాటాలలో రాటుదేలిన ఉల్ఫా కొద్దికాలంలోనే ఆగ్నేయాసియాలోనే కరడుగట్టిన వేర్పాటువాద సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ మిలిటెంట్ సంస్థకు చైనా మద్దతు ఉందని భావిస్తారు. 

అసోం గ్రామీణ ప్రాంతాల్లో ఉల్ఫాకు పట్టు ఉండడంతో సైన్యానికి కొరకరానికొయ్యగా మారింది. అంతేకాదు, పొరుగు రాష్ట్రాల్లోని వేర్పాటు వాద సంస్థలతోనూ ఉల్ఫా సత్సంబంధాలు కొనసాగించింది.

  • Loading...

More Telugu News