Vijayasai Reddy: తెలంగాణ ఎన్నికల ఫలితాలపై విజయసాయి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Interesting comments of Vijayasai Reddy on Telangana election results
  • చంద్రబాబు, పురందేశ్వరి వల్ల కాంగ్రెస్, బీజేపీలకు ఒరిగింది ఏమిటని ప్రశ్న
  • వీళ్ల సామాజికవర్గం బలంగా ఉందని చెప్పుకుంటున్న చోట్ల కూడా బీఆర్ఎస్ గెలిచిందని విమర్శలు
  • కాంగ్రెస్ గెలుపులో టీడీపీ సహకారం ఉందని విశ్లేషణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ అధికార పీఠం ‘హస్త’గతమైంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. 64 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోగా మిత్ర పక్షం సీపీఐ 1 స్థానంలో విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన కసరత్తు కూడా మొదలైంది. అయితే కాంగ్రెస్  సునాయాస విజయానికి దోహదపడ్డ అంశాల విశ్లేషణలో టీడీపీ కూడా పేరు వినిపిస్తోంది. పసుపు పార్టీ పరోక్షంగా కాంగ్రెస్‌కు సాయపడిందనే వాదన గట్టిగానే వినిపిస్తోంది. అంతేకాదు.. ఒక సామాజిక వర్గం కాంగ్రెస్ వైపు మొగ్గుచూపిందనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ఈ విశ్లేషణలపై వైఎస్సార్‌సీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి నివాసాలున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచాడని ప్రస్తావించారు. వీళ్ల సామాజికవర్గం బలంగా ఉందని చెప్పుకునే కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాలను కూడా బీఆర్ఎస్ సొంతం చేసుకుందని అన్నారు. మరి చంద్రబాబు, పురందేశ్వరి వల్ల కాంగ్రెస్, బీజేపీలకు ఒరిగింది ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ఇదిలావుండగా తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ 64, బీఆర్ఎస్ 39, బీజేపీ 8, సీపీఐ 1, ఎంఐఎం 7 స్థానాల్లో విజయం సాధించాయి.
Vijayasai Reddy
Telangana election results
Congress win
Telangana
Telugudesam
BJP
Chandrababu
Daggubati Purandeswari

More Telugu News