Ben Stokes: ఐపీఎల్-2024కి దూరంగా ఉండాలని బెన్ స్టోక్స్ నిర్ణయం

  • గత సీజన్ లో సీఎస్కే జట్టుకు ప్రాతినిధ్యం వహించిన స్టోక్స్
  • రూ.16.25 కోట్లకు స్టోక్స్ ను కొనుగోలు చేసిన సీఎస్కే
  • మోకాలి గాయంతో దాదాపు టోర్నీ అంతా రిజర్వ్ బెంచ్ కే పరిమితం
  • ఐపీఎల్-2024 సీజన్ కు ముందు టీమిండియా-ఇంగ్లండ్ మధ్య 5 టెస్టుల సిరీస్
  • జాతీయ జట్టు కోసం ఐపీఎల్ కు దూరం కానున్న స్టోక్స్
Ben Stokes decided to not play in IPL2024

గత ఐపీఎల్ సీజన్ లో ఫిట్ నెస్ లేక దాదాపు టోర్నీ మొత్తం రిజర్వ్ బెంచ్ కే పరిమితమైన ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ కు కూడా దూరం కానున్నాడు. 

ఐపీఎల్-2023లో స్టోక్స్ ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.16.25 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. అయితే స్టోక్స్ ఆ సీజన్ లో ఆడింది రెండు మ్యాచ్ లే. మోకాలి గాయం తిరగబెట్టడంతో టోర్నీలో మిగిలిన మ్యాచ్ లు ఆడలేకపోయాడు. 

ఈ నేపథ్యంలో, చెన్నై సూపర్ కింగ్స్ బెన్ స్టోక్స్ విషయంలో ఇవాళ ఓ ప్రకటన చేసింది. ఐపీఎల్-2024లో స్టోక్స్ ఆడడంలేదని వెల్లడించింది. పనిభారం, ఫిట్ నెస్ సమస్యల వల్ల స్టోక్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎస్కే వివరించింది. 

ఐపీఎల్-2024 సీజన్ కు ముందు ఇంగ్లండ్ జట్టు టీమిండియాతో 5 టెస్టుల సిరీస్ ఆడనుందని, ఐపీఎల్ ముగిశాక టీ20 ప్రపంచకప్ జరగనుందని... ఈ నేపథ్యంలో, స్టోక్స్ నిర్ణయాన్ని సీఎస్కే యాజమాన్యం గౌరవిస్తున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 

32 ఏళ్ల స్టోక్స్ ఐసీసీ వరల్డ్ కప్ కోసం వన్డే ఫార్మాట్లో రిటైర్ మెంట్ ను కూడా పక్కనబెట్టి ఇంగ్లండ్ జట్టులోకి వచ్చాడు. అయితే, టోర్నీలో తొలి మూడు మ్యాచ్ లకు దూరంగా ఉన్న స్టోక్స్... మిగతా మ్యాచ్ ల్లోకి అందుబాటులోకి వచ్చినా అప్పటికే ఇంగ్లండ్ కుదేలైంది. ఈ టోర్నీలో స్టోక్స్ ఒక సెంచరీ, రెండు అర్ధసెంచరీలు సాధించాడు. అయితే, తాను ఆడిన 6 మ్యాచ్ ల్లో స్టోక్స్ ఒక్క మ్యాచ్ లోనూ బౌలింగ్ చేయలేదు.

More Telugu News