Supreme Court: స్వలింగ వివాహాలపై తన గత తీర్పును సమీక్షించేందుకు సుప్రీంకోర్టు అంగీకారం

Supreme Court agrees to reconsider its decision on same sex marriages
  • స్వలింగ వివాహాలను గతంలో వ్యతిరేకించిన సుప్రీంకోర్టు
  • నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలంటూ పిటిషన్లు
  • ఈ నెల 28న విచారణ చేపట్టనున్న అత్యున్నత న్యాయస్థానం
భారత్ లో స్వలింగ వివాహాలను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు గతంలో తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. స్వలింగ జంటలకు గుర్తింపు విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది పార్లమెంటు, ఆయా రాష్ట్రాల చట్టసభలేనని అక్టోబరు 17 నాటి తన తీర్పులో స్పష్టం చేసింది. 

అయితే ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను పరిగణనలోకి తీసుకుని, తన గత నిర్ణయాన్ని పునఃపరిశీలనకు అత్యున్నత న్యాయస్థానం నేడు అంగీకారం తెలిపింది. స్వలింగ సంపర్కుల తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. స్వలింగ సంపర్కుల వివాహాలపై నిర్ణయం తీసుకోవాలంటూ సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ కు విజ్ఞప్తి చేశారు. 

"దీనిపై మేం ఓపెన్ కోర్ట్ హియరింగ్ చేపట్టాలని కోరాం. నవంబరు 28న దీనిపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఇది ఎంతమాత్రం విస్మరించదగ్గ అంశం కాదు. వీళ్లు మెజారిటీ వర్గమా, మైనారిటీ వర్గమా అన్నది కాదు... వీళ్లపై వివక్ష ఉందన్నది మాత్రం నిజం. వివక్ష ఉంది అంటే అందుకు పరిష్కారం కూడా ఉండాలి. అందుకే మేం దీనిపై ఓపెన్ కోర్ట్ హియరింగ్ చేపట్టాలని అంటున్నాం" అని రోహత్గీ వివరించారు. 

అందుకు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ స్పందిస్తూ, ముందు రివ్యూ పిటిషన్లను పరిశీలిచాల్సి ఉందని, ఈ విషయంలో ఓపెన్ కోర్ట్ హియరింగ్ చేపట్టాలంటున్న న్యాయవాది (రోహత్గీ) వాదనలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించారు.
Supreme Court
Same Sex Marriages
Petitions
Review
India

More Telugu News