Cricket: క్రికెట్ అభిమానులారా ఇలా చేయకండి ప్లీజ్:హర్భజన్ సింగ్

  • ఆస్ట్రేలియా ఆటగాళ్ల కుటుంబ సభ్యులపై ట్రోలింగ్‌ను ఖండించిన భజ్జీ
  • ఇలాంటి ప్రవర్తనను అభిమానులు మానుకోవాలని అభ్యర్థన
  • మ్యాక్స్‌వెల్, ట్రావిస్ హెడ్ భార్యలపై ట్రోలింగ్ నేపథ్యంలో మాజీ దిగ్గజం స్పందన
Cricket fans please donot do this says Harbhajan Singh

వరల్డ్ కప్‌ 2023 ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి అనంతరం ఆస్ట్రేలియా ఆటగాళ్ల కుటుంబ సభ్యులను ట్రోలింగ్ చేయడాన్ని భారత మాజీ దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఖండించాడు. ఆసీస్ ఆటగాళ్ల కుటుంబ సభ్యులపై ట్రోలింగ్‌కు సంబంధించి వస్తున్న రిపోర్టులు అవమానకరమైనవని పేర్కొన్నాడు. ‘‘టీమిండియా బాగా ఆడింది. అయితే ఫైనల్‌లో మెరుగైన ఆటతీరు ప్రదర్శించిన ఆస్ట్రేలియా గెలిచింది. అది అంతవరకే. క్రికెటర్లు, వారి కుటుంబాలపై ట్రోల్ ఎందుకు? దయచేసి క్రికెట్ అభిమానులు అందరూ అలాంటి ప్రవర్తన ఆపాలని అభ్యర్థిస్తున్నాను. వివేకం, గౌరవం చాలా ముఖ్యమైనవి’’ అని హర్భజన్ ‘ఎక్స్’ వేదికగా స్పందించాడు.

కాగా వరల్డ్ కప్2023 ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి అనంతరం ఆస్ట్రేలియా కుటుంబ సభ్యులపై భారత క్రికెట్ ఫ్యాన్స్ ట్రోలింగ్‌కు దిగారు. ఇన్‌స్టాగ్రామ్, 'ఎక్స్'తోపాటు పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై అవమానకర రీతిలో పోస్టులు పెట్టారు. ముఖ్యంగా గ్లెన్ మాక్స్‌వెల్ భార్య వినీ రామన్, సెంచరీ హీరో ట్రావిస్ హెడ్ భార్య జెస్సికా డేవిస్‌తో పాటు పలువురు ఆటగాళ్ల కుటుంబ సభ్యులను ట్రోల్‌ చేశారు. అసహ్యకరమైన, అవమానపరిచే రీతిలో కామెంట్‌లు పెట్టారు. ఇలా పోస్టులు పెట్టడం విమర్శలపాలైంది. దీంతో హర్భజన్ సింగ్ స్పందించాడు.

More Telugu News