Ricky Ponting: టీమిండియా ఓటమిపై ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ స్పందన

Australian legend Ricky Pontings reaction to Team Indias defeat
  • ‘స్లో పిచ్’ రూపొందించడం భారత్ వ్యూహాత్మక తప్పిదని అభిప్రాయపడ్డ పాంటింగ్
  • పిచ్ కారణంగా భారత్ మూల్యం చెల్లించుకుందని వ్యాఖ్య
  • అజేయ భారత్‌ను ఓడించే అవకాశం ఆస్ట్రేలియాకు పిచ్ రూపంలో లభించిందన్న మైఖేల్ వాన్
ప్రపంచ కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఓటమిపై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  ఇలాంటి పిచ్‌ను సిద్ధం చేయడం ఆతిథ్య జట్టు వ్యూహాత్మక తప్పిదమని అభివర్ణించాడు. స్లో పిచ్‌ను సిద్ధం చేసినందుకు భారత్ మూల్యం చెల్లించుకుందని వ్యాఖ్యానించాడు. ఉపఖండంలో పిచ్ పరిస్థితులు ఈ మధ్య ఈ విధంగానే ఉంటున్నాయని, భారత్ రూపొందించిన పిచ్‌ భారత్‌పైకే బ్యాక్ ఫైర్ అయ్యిందని అభిప్రాయపడ్డాడు. మ్యాచ్‌ సమయంలో తన కామెంటరీలో రికీ పాంటింగ్ ఈ విధంగా స్పందించాడు. 

ఇక ఇంగ్లండ్ దిగ్గజం మైఖేల్ వాన్ స్పందిస్తూ... టోర్నమెంట్‌లో ఫైనల్ వరకు అజేయంగా నిలిచిన భారత్‌ను ఓడించే అవకాశాన్ని ఆస్ట్రేలియాకి పిచ్‌ అందించిందని అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా చాలా వ్యూహాత్మకమైన జట్టు అని, వారు చాలా స్పష్టతతో ఆడారని అన్నాడు. ఇలాంటి పిచ్‌ను సిద్ధం చేయడం ఆస్ట్రేలియాకు కలిసొచ్చిందని అన్నాడు. ఆసీస్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ చెప్పినదానిని చేసి చూపించారని, ప్రేక్షకులను నిశ్శబ్దం చేశారని అన్నారు. లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 43 ఓవర్లలో ఛేదిస్తుందని ఊహించలేదని పేర్కొన్నాడు. ఇక భారత్ గొప్ప టీమ్ అయినప్పటికీ పిచ్ ఆస్ట్రేలియాను విజేతగా నిలిపిందని ఇంగ్లండ్ ఆటగాడు నాసిర్ హుస్సేన్ ‘స్ర్కై స్పోర్ట్స్’తో మాట్లాడుతూ వ్యాఖ్యానించాడు. టీమిండియాలోని నలుగురు బౌలర్లు అంతగా ప్రభావం చూపకపోవడానికి పిచ్ కారణమని అన్నాడు.

ఇక నాకౌట్ మ్యాచ్‌లు మొదలైనప్పటి నుంచి పిచ్‌పై పెద్ద ఎత్తున చర్చ మొదలైన విషయం తెలిసిందే. ముంబైలో జరిగిన న్యూజిలాండ్‌పై సెమీ ఫైనల్‌కు ముందు పిచ్‌ను మార్చారంటూ విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇక వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ఫీల్డింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. అయితే తాము టాస్ గెలిచినా బ్యాటింగే ఎంచుకునే వాళ్లమని భారత కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. మొత్తంగా మొదటి ఫీల్డింగ్ చేసిన ఆస్ట్రేలియాకు పిచ్ నుంచి అన్ని విధాలుగా సహకారం లభించిన విషయం తెలిసిందే.
Ricky Ponting
India vs Australia final
World cup 2023
Team India
Cricket

More Telugu News