World Cup final: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో 5 టర్నింగ్ పాయింట్లు ఇవే.. టీమిండియా ఓడిపోయింది ఇందుకే!

These are the 5 turning points in the World Cup final match to Team India lost

  • శుభారంభాన్ని అందించడంలో విఫలమైన ఓపెనర్ గిల్
  • మిడిల్ ఓవర్లలో దారుణంగా నెమ్మదించిన స్కోర్ బోర్డ్
  • ఆరంభంలో పట్టుసాధించినా ఆ తర్వాత వికెట్లు తీయడంలో ఫెయిల్ అయిన భారత్ బౌలర్లు

వరల్డ్ కప్ 2023 లీగ్ దశలో 9కి తొమ్మిది విజయాలు, సెమీఫైనల్లో న్యూజిలాండ్‌పై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించిన టీమిండియా కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో చేతులు ఎత్తేసింది. భారత్ నిర్దేశించిన 240 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా సునాయాసంగా ఛేదించి రికార్డు స్థాయిలో 6వసారి వరల్డ్ కప్‌ను సొంతం చేసుకుంది. అయితే మ్యాచ్‌పై ఆస్ట్రేలియా పట్టు సాధించడానికి 5 కీలకమైన టర్నింగ్ పాయింట్లు ఉన్నాయి. మ్యాచ్‌ని మలుపుతిప్పి భారత్ ఓటమికి దారితీసిన ఆ 5 టర్నింగ్ పాయింట్లను ఒకసారి గుర్తుచేసుకుందాం..

శుభారంభాన్ని అందించడంలో గిల్ ఫెయిల్..
స్లో పిచ్‌పై బ్యాటింగ్‌కు దిగిన ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ చక్కటి ఆరంభాన్ని అందించడంలో ఫెయిల్ అయ్యాడు. ఒకవైపు రోహిత్ శర్మ ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడుతుండగా గిల్ ఇబ్బంది పడుతూ కనిపించాడు. దీంతో టోర్నీలో మిగతా మ్యాచ్‌ల్లో మంచి ఆరంభాలే దక్కినప్పటికీ ఫైనల్లో ఆశించిన ఆరంభాన్ని అందించడంలో గిల్ విఫలమయ్యాడు. గిల్ కారణంగా రోహిత్ ధాటిగా ఆడినా రావాల్సినన్ని పరుగులు రాలేదు. షాట్లు ఆడేందుకు ఇబ్బంది పడి చివరికి అనూహ్యంగా స్వల్ప స్కోరుకే ఔటయ్యాడు.

మిడిల్ ఓవర్లలో దారుణంగా పడిపోయిన రన్‌రేట్
5వ ఓవర్‌లో శుభ్‌మాన్ గిల్, 10వ ఓవర్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ ఔటయ్యాక భారత స్కోరు బోర్డు వేగం అమాంతం పడిపోయింది. 10 ఓవర్లకు 80/2తో పటిష్ఠమైన స్థితిలో టీమిండియా కనిపించింది. కానీ ఆ వెంటనే శ్రేయాస్ అయ్యర్ (4) ఔటవడంతో స్కోరు 81/3గా మారిపోయింది. ఆ తర్వాత వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డ విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ జాగ్రత్తగా ఆడారు. నాలుగో వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే ఈ క్రమంలో స్కోరు దారుణంగా నెమ్మదించింది. 11-20 ఓవర్ల మధ్యలో ఒక వికెట్ నష్టానికి 35 పరుగులు మాత్రమే వచ్చాయి. 21-30 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 37 పరుగులు మాత్రమే రాబట్టారు. బౌండరీలు చూద్దామన్నా కనిపించలేదు. మొత్తంగా భారత ఇన్నింగ్స్‌లో 13 బౌండరీలు, 3 సిక్సర్లు మాత్రమే ఉన్నాయంటే టీమిండియా బ్యాట్స్‌మెన్ ఎంత నెమ్మదిగా ఆడారో అర్థం చేసుకోవచ్చు.

జడేజాని ముందుగా బ్యాటింగ్‌కు పంపడం...
విరాట్ కోహ్లి (54) ఔటయ్యాక భారత్ స్కోరు 148/4గా ఉంది. ఈ దశలో సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి రావాల్సి ఉంది. కానీ ఎవరూ ఊహించని విధంగా రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చాడు. రన్ రేట్ మెరుగుపరుస్తాడేమోనని భావించినప్పటికీ జడేజా విఫలమయ్యాడు. 22 బంతులు ఎదుర్కొని 9 పరుగులు మాత్రమే కొట్టి ఔటయ్యాడు. దీంతో ఆ దశలో రన్‌రేట్ మెరుగుపరుచుకునే అవకాశాన్ని కోల్పోయినట్టు అయ్యిందని క్రికెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్ సహజ సిద్ధంగా వేగంగా ఆడుతాడు కాబట్టి అతడినే ముందుగా పంపించి ఉంటే బావుండేదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

సిరాజ్‌ను ఆలస్యంగా బౌలింగ్ కు దింపడం..
జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఈ టోర్నమెంట్‌లో బౌలింగ్‌లో చక్కటి ఆరంభాలను అందించారు. అయితే కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో బుమ్రా, మహ్మద్ షమీతో కెప్టెన్ బౌలింగ్ వేయించాడు. షమీతో బౌలింగ్ వేయించడం, మొదటి ఓవర్‌లోనే అతడు వికెట్ తీసినప్పటికీ ఆ తర్వాత పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. కొత్త బంతితో సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తాడని తెలిసి కూడా బౌలింగ్ చేయించకపోవడం మైనస్‌గా మారిందని చెప్పాలి. బంతి పాతబడ్డాక సిరాజ్ అంతగా ప్రభావం చూపలేకపోయాడనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లపై ఒత్తిడి పెంచడంలో వైఫల్యం..
ఆస్ట్రేలియా ఆరంభంలో  47/3 వద్ద ఉన్నప్పుడు టీమిండియా పైచేయి సాధించినట్టు కనిపించింది. జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ త్వరత్వరగా వికెట్లు తీయడంతో భారత్ గెలుపు అవకాశాలు మెరుగయ్యేలా కనిపించాయి. అయితే వికెట్లు తీయడంలో బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ (137), మార్నస్ లాబూషేన్ (58) 4వ వికెట్‌కు 192 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరి భాగస్వామ్యాన్ని బౌలర్లు విడదీయలేకపోయారు. వికెట్ తీయలేకపోవడమే కాకుండా పరుగులను కూడా నియంత్రించలేకపోయారు. దీంతో చూస్తుండగానే మ్యాచ్ ఆస్ట్రేలియా చేతుల్లోకి చేజారిపోయింది.

World Cup final
India vs Australia final
Cricket
Team India
Australia
  • Loading...

More Telugu News