Andhra Pradesh: భార్య ప్రసవించిన ఆసుపత్రికే భర్త మృతదేహం.. పల్నాడు జిల్లాలో విషాదం

Husband dead body braught to the same hospital where his wife delivered in palnadu district

  • వైద్యారోగ్య శాఖ మంత్రి సొంత జిల్లాలోని ఆసుపత్రుల్లో వసతుల లేమి
  • రాత్రిపూట గర్భిణిని మూడు ఆసుపత్రులు తిప్పిన కుటుంబ సభ్యులు
  • డబ్బులు తెస్తానని వెళ్లిన భర్త.. రోడ్డుపై గుంతలో పడి దుర్మరణం

ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని సొంత జిల్లా పల్నాడులో విషాదం చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రులలో వసతుల లేమి కారణంగా ఓ గర్భిణి మూడు ఆసుపత్రులకు తిరగాల్సి వచ్చింది. రాత్రిపూట పురుటి నొప్పులతో బాధపడుతున్న మహిళను కుటుంబ సభ్యులు ఆసుపత్రుల చుట్టూ తిప్పాల్సి వచ్చింది. చివరకు 70 కిలోమీటర్ల దూరంలోని ఆసుపత్రిలో చేర్చి కాన్పు చేయగా.. డబ్బులు తీసుకొస్తానని ఇంటికి వెళ్లిన భర్త విగతజీవిగా అదే ఆసుపత్రికి చేరడం స్థానికులను కంటతడి పెట్టిస్తోంది.

జిల్లాలోని కారంపూడికి చెందిన రామాంజిని అనే మహిళ నిండు గర్బిణి.. శుక్రవారం రాత్రి ఆమెకు పురుటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు కారంపూడి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రాత్రి పది గంటలు దాటింది. ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో రామాంజినిని గురజాల ఆసుపత్రికి తీసుకెళ్లారు. సరైన వసతులు లేవంటూ అక్కడి సిబ్బంది చెప్పడంతో 70 కిలోమీటర్ల దూరంలోని నరసరావుపేట ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఆమెను చేర్చుకుని ప్రసవానికి ఏర్పాట్లు చేస్తుండగా రామాంజిని భర్త ఆనంద్ డబ్బుల కోసం ఇంటికి వెళ్లాడు. కాసేపటికే రామాంజిని పాపకు జన్మనిచ్చింది.

కారంపూడి నుంచి డబ్బులతో తిరిగి నరసరావుపేటకు బయలుదేరిన ఆనంద్.. రోడ్డుపై ఉన్న ఓ భారీ గుంతలో పడి అక్కడికక్కడే చనిపోయాడు. స్థానికులు ఆనంద్ ను నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. భార్య ప్రసవించిన ఆసుపత్రికే భర్త మృతదేహం రావడం చూసిన వారందరినీ కంటతడి పెట్టించింది. భర్త మరణవార్త విని రామాంజిని కన్నీటిపర్యంతమైంది. కాగా, ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవం కూడా చేయలేని పరిస్థితి నెలకొనడంపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. మంత్రి సొంత జిల్లాలోనే ఇలాంటి పరిస్థితి ఉందంటే మిగతా చోట్ల ఎలా ఉందోననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Andhra Pradesh
palnadu
husband dead
wife delivery
Vidadala Rajini
  • Loading...

More Telugu News