Adult Diaper: డైపర్ ను చూసి బాంబుగా పొరబడి.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. అమెరికాలో ఘటన

Adult Diaper Mistaken for Bomb Plane Makes Emergency Landing In US

  • పనామా నుంచి ఫ్లోరిడాకు బయలుదేరిన కోపా ఎయిర్ లైన్స్ విమానం
  • ఫ్లైట్ టాయిలెట్ లో పెద్దవాళ్లు వేసుకునే డైపర్ వదిలేసిన ప్రయాణికుడు
  • గంట ప్రయాణం తర్వాత డైపర్ ను చూసి బాంబుగా పొరబడ్డ సిబ్బంది
  • విమానాన్ని వెనక్కి మళ్లించి పనామాలో అత్యవసరంగా దించిన పైలట్

ఫ్లైట్ టాయిలెట్ లో కనిపించిన అడల్ట్ డైపర్ సిబ్బందిని, ప్రయాణికులను కాసేపు భయాందోళనలకు గురిచేసింది.. ఆకాశంలో దూసుకుపోతున్న విమానాన్ని అత్యవసరంగా కిందికి దిగేలా చేసింది. అనారోగ్య సమస్యల కారణంగా పెద్దవాళ్లు వేసుకునే ఆ డైపర్ ను ఫ్లైట్ సిబ్బంది బాంబుగా భావించడమే ఈ గందరగోళానికి కారణమైంది. అమెరికాలోని పనామా సిటీ నుంచి ఫ్లోరిడాలోని తంపాకు బయలుదేరిన విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులను అందరినీ కిందకు దించి, విమానాన్ని అణువణువూ గాలించిన సెక్యూరిటీ సిబ్బంది అందులో పేలుడు పదార్థాలు ఏవీ లేవని నిర్ధారించాకే మళ్లీ బయలుదేరింది.

కోపా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం పనామా సిటీ నుంచి ఫ్లోరిడాకు బయలుదేరింది. ఓ గంట ప్రయాణించాక టాయిలెట్ లోకి వెళ్లిన ఓ ప్రయాణికుడికి అనుమానాస్పద వస్తువు కనిపించింది. విమానంలోని సిబ్బంది దానిని పరిశీలించి బాంబు కావచ్చని భయాందోళనకు గురయ్యారు. విషయాన్ని పైలట్ దృష్టికి తీసుకెళ్లడంతో అధికారులకు సమాచారం అందించి, విమానాన్ని వెనక్కి తిప్పాడాయన. మళ్లీ పనామాలోనే అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఫ్లైట్ లోని 144 మంది ప్రయాణికులను కిందికి దించి విమానంలో బాంబ్ స్క్వాడ్ గాలింపు చేపట్టింది. టాయిలెట్ లోని అనుమానాస్పద వస్తువును అడల్ట్ డైపర్ గా గుర్తించింది. అయినప్పటికీ విమానాన్ని నిశితంగా గాలించింది. పేలుడు పదార్థాలు ఏవీ కనిపించకపోవడంతో ప్రయాణానికి అనుమతిచ్చింది. దీంతో విమానం ఆలస్యంగా ఫ్లోరిడాకు బయలుదేరింది.

Adult Diaper
Plane
Flight toilet
Emergency landing
USA
Bomb
  • Loading...

More Telugu News