Hulk Hogan: 70 ఏళ్ల వయసులో మూడో పెళ్లి చేసుకున్న డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్

WWE star Hulk Hogan married for third time
  • రెజ్లింగ్ వినోద ప్రపంచంలో మేటిగా గుర్తింపుతెచ్చుకున్న హల్క్ హోగాన్
  • హల్క్ హోగాన్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు
  • ఇప్పటికే రెండు పెళ్లిళ్లు... ఐదుగురు పిల్లలు
  • తాజాగా ఓ అకౌంటెంట్ తో మూడో వివాహం
ప్రపంచాన్ని కేబుల్ టీవీ పలకరించిన కొత్తలో వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టయిన్ మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) దేశాలకు అతీతంగా వీక్షకులకు సరికొత్త అనుభూతిని అందించింది. 90వ దశకంలో భారత్ లోనూ కేబుల్ విప్లవం ప్రారంభం కాగా, అప్పట్లో స్టార్ టీవీ వారి స్పోర్ట్స్ చానల్లో ఈ రెజ్లింగ్ వినోదం అందరినీ అలరించేది.

భారత్ కు పరిచయం అయిన డబ్ల్యూడబ్ల్యూఈ తొలి తరం రెజ్లర్లలో హల్క్ హోగాన్ ఎంతో ప్రముఖుడు. తన కండలు తిరిగిన దేహం, పొడవైన మీసాలు, తన ట్రేడ్ మార్క్ రెజ్లింగ్ విన్యాసాలతో హల్క్ హోగాన్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఆయన యోగా ఇన్ స్ట్రక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. 

ఇప్పుడు హల్క్ హోగాన్ గురించి ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే... ఆయన మూడో పెళ్లి చేసుకున్నాడు. అది కూడా 70 ఏళ్ల వయసులో. స్కై డైలీ (45 ఏళ్లు) అనే అకౌంటెంట్  ను హల్క్ హోగాన్ తన జీవితంలోకి ఆహ్వానించాడు. అన్నట్టు... హోగాన్ పెళ్లాడిన స్కై డైలీకి కూడా ఇదివరలో రెండు పెళ్లిళ్లు జరిగాయి. ఆమెకిది మూడో వివాహం. 

తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో క్లియర్ వాటర్ ప్రాంతంలోని ఇండియన్ రాక్స్ బాప్టిస్ట్ చర్చిలో హల్క్ హోగాన్, స్కై డైలీల వివాహం జరిగింది. రూ.4 కోట్ల విలువ చేసే వజ్రపుటుంగరాలను పరస్పరం మార్చుకున్నారు. ఈ వివాహ వేడుకలో హోగాన్ బ్లాక్ సూట్ లో దర్శనమివ్వగా, స్కై డైలీ వైట్ వెడ్డింగ్ గౌన్ లో మెరిసిపోయింది. 

రెజ్లింగ్ వీరుడు హల్క్ హోగాన్ గతంలో లిండా, జెన్నిఫర్ మెక్ డేనియల్ అనే మహిళలను పెళ్లాడాడు. ఆయనకు ఇప్పటికే ఐదుగురు సంతానం ఉన్నారు.
Hulk Hogan
Third Marriage
Sky Daily
WWE
USA

More Telugu News