Jammu And Kashmir: జమ్మూకశ్మీర్ డీఎస్పీకి ఉగ్రవాదులతో లింకు.. అరెస్టు చేసిన పోలీసులు

Jammu and Kashmir Police DSP Sheikh Aadil Mushtaq Arrested Over Alleged Connections With Terrorist

  • గతంలో పట్టుబడ్డ ఉగ్రవాదిని ప్రశ్నించగా బయటబడ్డ డీఎస్పీ నిర్వాకం
  • టెలిగ్రామ్ లో ఉగ్రవాదులతో నిరంతరం టచ్ లో ఉన్న డీఎస్పీ ఆదిల్ ముస్తాక్
  • జమ్మూకశ్మీర్ లో బలవంతపు వసూళ్లకు పాల్పడినట్లు ఆదిల్ పై ఆరోపణలు

అక్రమ సంపాదన కోసం ఉగ్రవాదులతో చేతులు కలిపిన జమ్మూకశ్మీర్ డీఎస్పీ షేక్ ఆదిల్ ముస్తాక్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాదులను పట్టుకోవాల్సిన ఉద్యోగం చేస్తూ అదే ఉగ్రవాదులు చట్టం నుంచి తప్పించుకునేందుకు సాయం చేస్తున్నాడని ఆరోపించారు. అరెస్టు కాకుండా తప్పించుకోవడం ఎలా.. అనే విషయంలో ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ ఉగ్రవాదులను తప్పిస్తున్నాడని చెప్పారు. గతంలో పట్టుబడ్డ ఓ ఉగ్రవాదిని ప్రశ్నించగా డీఎస్పీ ఆదిల్ ముస్తాక్ నిర్వాకం బయటపడిందని ఉన్నతాధికారులు తెలిపారు.

ఆదిల్ ముస్తాక్ తో తాను నిరంతరం టచ్ లో ఉన్నానని సదరు ఉగ్రవాది చెప్పాడన్నారు. సదరు ఉగ్రవాది ఫోన్ ను పరిశీలించగా.. ఆదిల్ ముస్తాక్ తో దాదాపు 40 గంటల పాటు ఫోన్ లో సంభాషించినట్లు బయటపడిందన్నారు. టెలిగ్రామ్ యాప్ ద్వారా ఫోన్ కాల్స్, సందేశాలతో ఉగ్రవాదులతో ఆదిల్ సంభాషించాడని చెప్పారు. ఈ ఆధారాలతో ఆదిల్ ను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెట్టగా.. న్యాయమూర్తి ఆరు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించారని వివరించారు.

ఉగ్రవాదులకు నగదు ఎలా చేరుతోందనే అంశంపై పరిశోధన చేస్తున్న మరో ఉన్నతాధికారిని కేసులో ఇరికించేందుకు డీఎస్పీ ఆదిల్ ప్రయత్నించాడని అధికారులు తెలిపారు. ఉగ్రవాదులతో సదరు అధికారిపై కేసు పెట్టించినట్లు ఆధారాలు లభించాయన్నారు. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో ముగ్గురిని అరెస్టు చేసి వారి నుంచి రూ.31 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. వారిని విచారించగా.. ఆ ముగ్గురిలో ఒకరు పోలీస్ ఉన్నతాధికారిపై అవినీతి ఆరోపణలు చేసినట్లు బయటపడిందన్నారు.

దీనికి సంబంధించి ఓ ఫిర్యాదును కూడా ఆదిల్ సృష్టించాడని వివరించారు. ఉగ్రవాదులతో సంబంధాలు పెట్టుకోవడంతో పాటు డీఎస్పీగా తన అధికారాన్ని ఉపయోగించి ఆదిల్ ముస్తాక్ వ్యాపారుల నుంచి బలవంతంగా నగదు వసూళ్లకు పాల్పడ్డాడని చెప్పారు. పలువురిని బ్లాక్ మెయిల్ చేసినట్లు ఆదిల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, ఆదిల్ పై ఉన్న ఆరోపణలు అన్నింటిపైనా విచారణ జరిపిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News