Guiness world records: ఏడాదిలో 777 సినిమాలు చూసి గిన్నిస్ రికార్డు

US Man Goes To 777 Movies In A Single Year Smashes World Record

  • అమెరికా యువకుడు జాక్ స్వాప్ అరుదైన రికార్డు
  • రోజుకు సగటున దాదాపు మూడు సినిమాలు చూసిన వైనం
  • ఉద్యోగం చేస్తూ కూడా జాక్ ఈ రికార్డు నెలకొల్పినట్టు గిన్నిస్ రికార్డ్స్ వెల్లడి

తన సినీ అభిమానంతో ఓ అమెరికా యువకుడు ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఒకే ఏడాదిలో ఏకంగా 777 సినిమాలు చూసి గిన్నిస్ బుక్‌లో స్థానం దక్కించుకున్నాడు. ఉద్యోగం చేస్తూ కూడా జాక్ స్వాప్ ఈ రికార్డు సాధించడం గమనార్హం. 2018లో ఫ్రాన్స్‌కు చెందిన విన్సెంట్ క్రాన్ ఏడాది కాలంలో 717 సినిమాలు చూసి నెలకొల్పిన రికార్డును జాక్ తాజాగా బద్దలు కొట్టాడు. 

తాను సినిమాలకు వీరాభిమానినని జాక్ తెలిపాడు. ఏడాదికి సగటున 150 వరకూ సినిమాలు చూస్తానని చెప్పాడు. తాజా రికార్డు కోసం గతేడాది జులైలో సినిమాలు చూడటం మొదలెట్టి ఈ ఏడాది జులై నాటికి మొత్తం సినిమాలు పూర్తిగా చూశాడు. 

అత్యధిక సినిమాలను అతడు రీగల్ సినిమా హాల్‌లోనే చూశాడు. ఇందుకోసం సినిమాహాల్ వాళ్లు అందించే మెంబర్‌షిప్ పథకంలో చేరాడు. ఇది తీసుకున్న వాళ్లు నెలకు 22 డాలర్లు చెలిస్తే నెలంతా కావాల్సినన్ని సినిమాలు చూడొచ్చు.

రోజూ ఉదయం నుంచి మధ్యాహ్నం 2.45 వరకూ ఉద్యోగం చేశాక అతడు సినిమా హాల్‌కు వెళ్లి రోజుకు సగటున మూడు సినిమాల వరకూ చూసేవాడు. ఇక వారాంతాల్లో ఇంతకంటే ఎక్కువ సంఖ్యలోనే వీక్షించేవాడు. 

గిన్నిస్ రికార్డ్స్ వారి నిబంధనల ప్రకారం, ఈ రికార్డు నెలకొల్పేందుకు అభ్యర్థులు సినిమాను ఆసాంతం చూడాల్సి ఉంటుంది. అంటే, థియేటర్‌లో సినిమా నడుస్తుండగా మొబైల్ చూసుకోవడం, లేదా చిన్న కునుకు తీయడం వంటివి అస్సలు చేయకూడదు. జాక్ ఈ నిబంధనలు పాటించాడో లేదో చెక్ చేసేందుకు సినిమాహాల్ వాళ్లు నిరంతరం అతడిపై ఓ కన్నేసి ఉంచేవారు. కానీ, సినీఅభిమానం విపరీతంగా ఉన్న అతడికి ఈ నిబంధనలు పెద్ద కష్టంగా అనిపించలేదు. దీంతో, అనుకున్న ప్రకారం సినిమాలు చూసి గిన్నిస్ రికార్డు బద్దలు కొట్టాడు.

Guiness world records
USA
  • Loading...

More Telugu News