Amit Shah: మూక దాడికి పాల్పడినా.. మైనర్‌‌పై అత్యాచారం చేసినా ఇక మరణశిక్షే.. నేర చట్టాల్లో కేంద్రం సంచలన మార్పులు

Capital Punishment For Mob Lynching Big Revamp Of Indian Criminal Laws

  • ఐపీసీ, సీఆర్‌‌పీసీ, ఎవిడెన్స్‌ యాక్టును రద్దు చేస్తామన్న అమిత్ షా
  • వాటి స్థానంలో మూడు కొత్త బిల్లులు.. లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి
  • తదుపరి పరిశీలన కోసం పార్లమెంటరీ స్థాయీ సంఘానికి సిఫారసు
  • శిక్షలు వేయడం కాదు.. న్యాయం అందించడమే కొత్త చట్టాల లక్ష్యమన్న అమిత్ షా

బ్రిటీష్ కాలం నాటి భారతీయ నేర చట్టాల్లో సమూల మార్పులకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. భారత శిక్షా స్మృతి (ఐపీసీ) స్థానంలో భారతీయ న్యాయ సంహిత–2023, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్‌‌పీసీ) స్థానంలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత–2023, ఎవిడెన్స్‌ యాక్ట్ (ఐఈఏ) స్థానంలో భారతీ సాక్ష్య –2023ను తీసుకురానుంది. శుక్రవారం ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా మూడు బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. తదుపరి పరిశీలన కోసం పార్లమెంటరీ స్థాయీ సంఘానికి ఈ బిల్లులను పంపిస్తామని చెప్పారు. 

‘‘దేశద్రోహ చట్టం రద్దు అయింది. దేశద్రోహం అనే పదం ప్రతిపాదిత చట్టంలో లేదు. భారతదేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతకు హాని కలిగించే చర్యలపై శిక్షించేందుకు సంబంధించి సెక్షన్ 150ని తీసుకొచ్చాం” అని అమిత్ షా చెప్పారు. 

‘‘ఎవరైనా సరే.. ఉద్దేశపూర్వకంగా మాటల ద్వారా కానీ, రాతల ద్వారా కానీ, ప్రత్యక్షంగా కానీ, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్‌ ద్వారా కానీ, ఆర్థిక మార్గాలను ఉపయోగించడం ద్వారా కానీ, ఇంకే విధంగానైనా సరే.. వేర్పాటువాద చర్యలు లేదా సాయుధ తిరుగుబాటు చర్యలు లేదా విధ్వంసక కార్యకలాపాలను ప్రోత్సహించడం, భారతదేశ సార్వభౌమాధికారం లేదా ఐక్యత, సమగ్రతను ప్రమాదంలో పడేసే చర్యలకు దిగితే.. జీవిత ఖైదు, లేదా ఏడేళ్ల జైలు శిక్ష, దాంతోపాటు జరిమానా కూడా విధిస్తారు” అని సెక్షన్ 150లో పేర్కొన్నారు.

మూక దాడి (మాబ్ లించింగ్) కేసుల్లో నేరస్థులుగా తేలితే ఉరి శిక్ష విధించాలనే నిబంధనను కూడా కేంద్రం ప్రవేశపెడుతుందని షా చెప్పారు. ఇదే సమయంలో సామూహిక అత్యాచారానికి పాల్పడితే.. 20 ఏళ్ల జైలు నుంచి జీవిత ఖైదు దాకా, మైనర్‌‌పై అత్యాచారం చేస్తే ఉరిశిక్ష విధించేలా నిబంధనలను పొందుపరిచినట్లు పేర్కొన్నారు.

‘‘ఐపీసీ, సీఆర్‌‌పీసీ, ఎవిడెన్స్‌ చట్టాన్ని రద్దు చేస్తాం. అవి బ్రిటీష్ కాలం నాటివి. బ్రిటీషర్ల పాలనను రక్షించుకునేందుకు, బలోపేతం చేసుకునేందుకు ఉద్దేశించినవి. వాటి స్థానంలో తీసుకొచ్చే కొత్త చట్టాలు.. భారత పౌరుల హక్కులను పరిరక్షిస్తాయి’’ అని అమిత్ షా వివరించారు. ‘‘శిక్షలు వేయడం కాదు.. న్యాయం అందించడం కొత్త చట్టాల లక్ష్యం. నేరాలను అరికట్టాలనే ఉద్దేశంతోనే శిక్షలు విధిస్తారు” అని చెప్పుకొచ్చారు.

Amit Shah
Mob Lynching
Capital Punishment
Indian Criminal Laws
Lok Sabha
IPC
CrPC
Indian Evidence Act
Bharatiya Nyaya Sanhita
Bharatiya Nagarik Suraksha Sanhita
Bharatiya Sakshya Bill
  • Loading...

More Telugu News