Telangana: పోగొట్టుకున్న ఫోన్ దొరకాలంటే ఇలా చేయండి.. పోలీసుల సూచన

Telangana bags first place in India in recovery of lost and stolen mobile phones using CEIR portal
  • మొబైల్ ఫోన్ల రికవరీలో దేశంలోనే తెలంగాణ టాప్
  • సీఈఐఆర్ వెబ్ పోర్టల్ తో సాధ్యమైందన్న అధికారులు
  • మీ సేవ సెంటర్ లో ఫిర్యాదు చేయాలని సూచన

పొరపాటున పోగొట్టుకున్నా, జేబు దొంగలు కాజేసినా.. పోయిన ఫోన్ తిరిగి దొరకడం దాదాపుగా అసాధ్యమేనని చాలామంది నమ్ముతారు. ఫోన్ పోయిందంటూ పోలీస్ కంప్లైంట్ చేయడం వృథా ప్రయాసగా భావించే వాళ్లు కూడా ఎక్కువే.. అయితే, ప్రస్తుతం పరిస్థితులు మారాయి. పోయిన ఫోన్ భద్రంగా మీ ఇంటికి నడిచొస్తుందని పోలీసులు చెబుతున్నారు. అపనమ్మకం పెట్టుకోకుండా ఫిర్యాదు చేయడంతో పాటు తాము చెప్పినట్లు చేస్తే మీరు పోగొట్టుకున్న ఫోన్ దొరుకుతుందని పోలీసులు అంటున్నారు. ఇలా పోయిన, కొట్టేసిన ఫోన్లను రికవరీ చేయడంలో దేశంలోనే తెలంగాణ పోలీసులది నెంబర్ వన్ స్థానమని వివరించారు.

సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) వెబ్‌సైట్ అందుబాటులోకి రావడంతో మొబైల్ ఫోన్ల రికవరీ శాతం బాగా పెరిగిందని పోలీసులు చెప్పారు. మొబైల్ పోగొట్టుకున్నా, ఎవరైనా మీ ఫోన్ ను కొట్టేసినా ముందుగా చేయాల్సింది దగ్గర్లోని మీసేవ సెంటర్ కు వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని సూచించారు. ఆ ఫిర్యాదు కాపీతో అదే నెంబర్ తో కొత్త సిమ్ తీసుకోవాలని చెప్పారు. దీంతో పాత నెంబర్ (పోగొట్టుకున్న ఫోన్ లోని) బ్లాక్ అయిపోతుంది, ఫోన్ మాత్రం పనిచేస్తుందని వివరించారు. అనంతరం సీఈఐఆర్ వెబ్ పోర్టల్ లోకి వెళ్లి బ్లాక్ లేదా లాస్ట్ మొబైల్ ఆప్షన్ పై క్లిక్ చేయాలని చెప్పారు. పోయిన ఫోన్ లో సేవ్ చేసిన కొన్ని నెంబర్లు, ఈఎంఐ నెంబర్ సహా అడిగిన వివరాలను నమోదు చేయాలన్నారు. ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే ఆ ఫోన్ ను బ్లాక్ చేస్తామని పోలీసులు వివరించారు.

మీ ఫోన్ దొరికిన వాళ్లు లేదా కొట్టేసిన వాళ్లు అందులో కొత్త సిమ్ వేసి వాడుకునేందుకు ప్రయత్నిస్తారని పోలీసులు చెప్పారు. దీంతో ఆ సిమ్ నెంబర్, ఫోన్ ఉన్న లొకేషన్ వివరాలతో పోలీసులతో పాటు బాధితుడికీ మెసేజ్ వస్తుందని వివరించారు. ఆ నెంబర్ కు కాల్ చేసి ఫోన్ తిరిగివ్వాలని లేదంటే దొంగతనం కేసు నమోదు అవుతుందని హెచ్చరిస్తామని పోలీసులు తెలిపారు. దీంతో వెంటనే ఫోన్ ను తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారని, గడిచిన మూడు నెలల వ్యవధిలోనే ఇలా 7 వేల ఫోన్లను తిరిగి బాధితులకు అప్పగించామని వివరించారు.

  • Loading...

More Telugu News